బెంగళూరు : ప్రముఖ ఎఫ్‌ఎంసిజి కంపెనీ బ్రిటానియా ఇండిస్టీస్ మార్చి ముగింపు నాటికి తమ ఉత్పత్తుల ధరలను 4.5 శాతం పెంచాలని యోచిస్తోంది. ఇదే విషయాన్ని ఆ కంపెనీ ఆర్ధిక ఫలితాల వెల్లడి సందర్బంగా శుక్రవారం వెల్లడించింది. 2024 డిసెంబర్ త్రైమాసికంలోనూ 2 శాతం ధరలను పెంచింది. దీంతో అదనంగా రూ.100 కోట్ల రెవెన్యూను పొందినట్లు పేర్కొంది. గడిచిన త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ 6.5 శాతం పెరిగి రూ.4,463 కోట్లకు చేరినట్లు పేర్కొంది. నికర లాభాలు 4.5 శాతం వృద్ధితో రూ.582 కోట్లుగా నమోదయ్యాయి. ఈ ద్రవ్యోల్బణం తగ్గడం లేదనీ ప్రతీ ఒక్కరు అంచనాకు వచ్చారని బ్రిటానియా వైస్ చైర్మన్ వరుణ్ బెర్రి పేర్కొన్నారు. ప్రభుత్వం విధించిన పామాయిల్ సుంకాలు, కోకో ధరలు ప్రభావం చూపుతున్నాయన్నారు. తృణధాన్యాలు 6.5 శాతం, నూనెలు, కొవ్వులు దాదాపు 15 శాతం, కూరగాయలు, పండ్ల ద్రవ్యోల్బణం అధికంగా ఒక్క అంకె లేదా రెండంకెల స్థాయిలలో పెరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
