- విఐ షేర్ల పరుగు
ముంబయి : టెలికం కంపెనీలు బ్యాంక్ గ్యారంటీలు సమర్పించాల్సిన నిబంధనను ఎత్తివేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో టెలికాం కంపెనీలపై ఆర్థికంగా భారం తగ్గనుందని ఆ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 2022కు ముందు నిర్వహించిన వేలంలో స్పెక్ట్రం దక్కించుకున్న టెలికాం కంపెనీలు బ్యాంకు గ్యారెంటీలు సమర్పించాలన్న నిబంధనను కేబినెట్ తొలగించింది. చెల్లించాల్సిన స్పెక్ట్రమ్ చెల్లింపులకు సంబంధించి వొడాఫోన్ ఐడియా వచ్చే 2025 అక్టోబర్ నుంచి 2026 సెప్టెంబర్‌ల మధ్య దాదాపు రూ.24,746 కోట్లు విలువైన బ్యాంకు గ్యారెంటీలను సమర్పించాల్సి ఉంది. తాజా నిర్ణయంతో తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్న విఐకి భారీ ఉపశమనం లభించినట్లయ్యింది. దీంతో మంగళవారం ఇంట్రాడేలో విఐ షేర్లు 17 శాతం మేర పెరిగాయి. తుదకు బిఎస్‌ఇలో 7.88 శాతంతో రూ.7.53 వద్ద ముగిసింది. ప్రభుత్వరంగ టెలికాం సంస్థ ఎంటిఎన్‌ఎల్ షేర్ 2.60 శాతం పెరిగి రూ.48.54 వద్ద ముగిసింది.
మార్కెట్లకు నష్టాలు..
మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్‌డిఎకి మెజారిటీ దక్కడంతో రెండు రోజులు లాభాల్లో సాగిన స్టాక్ మార్కెట్లు మంగళవారం నేల చూపులు చూశాయి. ఉదయం లాభాల్లో మొదలయిన స్టాక్స్.. మధ్యాహ్నం వరకు పెరుగుతూ వచ్చి.. ఆ తర్వాత చివరిలో అమ్మకాలను చవి చూశాయి. తుదకు బిఎస్‌ఇ సెన్సెక్స్ చివరకు 106 పాయింట్లు పతనమై 80,004కు దిగజారింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 27.40 పాయింట్ల నష్టంతో 24,194.50 వద్ద ముగిసింది. 2,179 షేర్లు లాభపడగా.. 1,580 షేర్లు నష్టపోగా.. 105 షేర్లు యథాతథంగా నమోదయ్యాయి.