- 10 గ్రాములు @98,100
న్యూఢిల్లీ : సామాన్యులు బంగారం కొనలేని స్థాయికి ఎగిసింది. తులం బంగారం దాదాపు లక్ష రూపాయల చేరువలో నమోదయ్యింది. భారత్ అమలు చేస్తోన్న దిగుమతి సుంకాలకు తోడు అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతరం కావడంతో పసిడి ధరలకు రెక్కలు వస్తోన్నాయి. బుధవారం ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.1650 పెరిగి రూ.98,100కు చేరింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పసిడిపై రూ.1650 ఎగిసి రూ.97,650గా పలికింది. పసిడి బాటలోనే వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కిలో వెండిపై రూ.1900 పెరిగి రూ.99,400కు చేరింది. అంతర్జాతీయంగా ఒక్క ఔన్స్ పసిడి ధర 3,318 డాలర్ల గరిష్టాన్ని తాకింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అనిశ్చితిలో ఉన్నప్పుడు ధనవంతులు సురక్షిత పెట్టుబడిగా బంగారంపై పెట్టుబడులు పెడతారు. దీంతో అపరంజి ధరలు ఎగిసిపడుతున్నాయి. మరోవైపు డాలర్ విలువ తగ్గడం కూడా పసిడికి డిమాండ్‌ను పెంచుతోంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై భారీగా టారిఫ్‌లు విధించనున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా చైనాపై వేస్తోన్న హెచ్చు సుంకాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితిని నెలకొల్పింది. ఈ వాణిజ్య యుద్ధం పసిడి ధరలకు ఆజ్యం పోయడంతో పాటుగా ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయోనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు.