సెల్‌ఫోన్‌ రీచార్జీ సెగలు

May 15,2024 01:47 #Business, #Mobile Network, #recharge
  •  తుది విడత పోలింగ్‌ ముగియగానే బాదుడు
  •  25 శాతం పెంచేందుకు ప్రయివేటు టెల్కోల యోచన
  •  ఆక్సిస్‌ కాపిటల్‌ రిపోర్ట్‌

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగాన్ని కుంగదీసి ప్రయివేటు టెలికాం కంపెనీలకు పట్టం కట్టడం వల్ల వినియోగదారులపై ఇప్పటికే విపరీత భారాలు పడుతున్నాయి. యాక్టివిటీ, వాయిస్‌కాల్‌, ఇంటర్నెట్‌ ఇలా రకరకాలుగా సేవలను విడదీసి బాదేస్తున్న ప్రయివేటు టెలికాం కంపెనీలు త్వరలోనే మరోమారు ధరల మోత మోగించనున్నాయి. సార్వత్రిక ఎన్నికలు ముగియగానే మొబైల్‌ ఫోన్‌ రీఛార్జీ బాదుడు షురూ చేయనున్నాయని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ ఆక్సిస్‌ కాపిటల్‌ ఒక నివేదికలో తెలిపింది. ప్రస్తుత ధరలపై 25 శాతం వరకు అధికంగా పెంచాలని టెల్కోలు యోచిస్తున్నాయి. టెలికం పరిశ్రమలో పోటీ, టెక్నాలజీ కోసం పెట్టుబడులు పెరిగాయనే సాకుతో టారిఫ్‌ ధరల పెంపునకు ప్లాన్లు వేస్తున్నాయి. ప్రభుత్వ రంగ బిఎస్‌ఎన్‌ఎల్‌ను చావుదెబ్బ తీసినందున మరో ప్రత్యామ్నాయం లేదు కాబట్టి.. ధరలు పెంచినా భరించక తప్పని పరిస్థితిలో వినియోగదారులున్నారని, 25 శాతం వరకు మోత మోగించవచ్చునన్న ధీమాతో ప్రయివేటు టెల్కో సంస్థలున్నట్లు తెలుస్తోంది.
జూన్‌ 1 నాటికి దేశంలో ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు పూర్తి కానున్నాయి. జూన్‌ 4న ఓట్లను లెక్కించనున్నారు. ఆ తర్వాత ఛార్జీల పెంపును ప్రకటించాలని టెలికం కంపెనీలు యోచిస్తున్నాయి. చివరి సారిగా 2021 డిసెంబర్‌లో దాదాపు 20 శాతం టారీఫ్‌లను పెంచాయి. 2023 ముగింపు నాటికి వొడాఫోన్‌ ఐడియా 19.3 శాతం, భారతీ ఎయిర్‌టెల్‌ 33 శాతం, రిలయన్స్‌ జియో 39.7 శాతం చొప్పున మార్కెట్‌ వాటాను కలిగి ఉన్నాయి. జియో మార్కెట్లోకి వచ్చిన సమయంలో రూ.149కే అన్‌లిమిటెడ్‌ ఉచిత కాల్స్‌, డేటాను అందించింది. ప్రస్తుతం ఈ ప్లాన్‌ను ధరను రూ. 209కి చేర్చింది. ఇదే బాటలో మిగితా ప్రయివేటు టెల్కోలు ప్రయాణించాయి. చాపకింద నీరులా దాదాపుగా మూడు, నాలుగు సార్లు పెంచాయి.
మొబైల్‌ చార్జీలను 25 శాతం మేర పెంచడం ద్వారా వినియోగదారుడి నుంచి నెలకు సగటు రెవెన్యూ (ఎఆర్‌పియు) 16 శాతం పెరగనుందని అంచనా. మార్చితో ముగిసిన త్రైమాసికంలో జియో ఎఆర్‌పియు రూ.181.7గా ఉంది. భారతీ ఎయిర్‌టెల్‌ ఎఆర్‌పియు రూ.209గా ఉంది. 2023 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో వొడాఫోన్‌ ఐడియా ఎఆర్‌పియు రూ.145గా ఉంది.
‘ఎఆర్‌పియు సగటున 10-15 శాతం పెరిగిన ఏడాదిలో వినియోగదారుడిపై అదనంగా రూ.100 భారం పడనుంది. ధరల పెంపు 4జి, 5జి ప్యాక్‌లపై ఉండొచ్చు. దీంతో ముందు రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ లాభపడొచ్చు. వొడాఫోన్‌ ఐడియా రెవెన్యూ పెరగనుంది.’ అని డెలాయిట్‌ సౌత్‌ ఏసియా టిఎంటి ఇండిస్టీ లీడర్‌ పియూష్‌ వైష్‌ పేర్కొన్నారు.
2023-24లో జియో స్థూల రెవెన్యూ 10.4శాతం పెరిగి రూ.1 లక్ష కోట్లను చేరగా.. నికర లాభాలు 11.48 శాతం ఎగిసి రూ.20,607 కోట్లుగా నమోదయ్యాయి. 2023-24లో భారతీ ఎయిర్‌టెల్‌ నికర లాభాలు 10.5 శాతం తగ్గి రూ.7,467 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. సంస్థ రెవెన్యూ 7.8 శాతం పెరిగి రూ.1.50 లక్షల కోట్లకు చేరింది. భారత టెల్కోలు లాభాలు, రెవెన్యూలను దండిగానే ఆర్జిస్తున్నప్పటికీ.. వినియోగదారులపై మళ్లీ భారం మోపాలనే యోచన ఆందోళకరం.

➡️