మార్చిలో ఎగబాకిన చైనా ఎగుమతులు

Apr 15,2025 00:34 #China's exports, #in March, #surge
  • 12.4 శాతం పెరుగుదల
  • ‘రాయిటర్స్‌’ అంచనాలను మించి నమోదు
  • వాణిజ్య మిగులు 102 బిలియన్‌ డాలర్లకు పైనే

బీజింగ్‌ : ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే ఎగుమతుల విషయంలో సాధారణంగా చైనా ఆధిపత్యం ఉంటుంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్న చైనాకు వెన్నుదన్నుగా నిలిచేది ఆ దేశ ఎగుమతులు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ టారిఫ్‌ల రగడకు ముందు మార్చి నెలలో చైనా ఎగుమతులు పెరిగాయి. అంచనాలను మించి 12.4 శాతం పెరుగుదలను నమోదు చేసిందని ‘రాయిటర్స్‌’ వివరించింది.

ఈ సమాచారం ప్రకారం.. గతేడాదితో పోలిస్తే మార్చిలో చైనా ఎగుమతులు 12.4 శాతం పెరిగాయి. ఆర్థికవేత్తల రాయిటర్‌ పోల్‌లో అంచనా వేసిన 4.4 శాతం వృద్ధిని ఇది సులభంగా అధిగమించింది. జనవరి-ఫిబ్రవరిలో ఎగుమతులు 2.3 శాతం పెరిగాయి. మార్చి నెలలో చైనా వాణిజ్య మిగులు 102.64 బిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో రూ.8.83 లక్షల కోట్లకు పైనే)గా ఉన్నది. ఇక ఇన్‌బౌండ్‌ షిప్‌మెంట్లు 4.3 శాతం తగ్గాయి. అయితే, రాయిటర్‌ పోల్‌లో ఈ తగ్గుదలను అంచనా 2.0 శాతంగా అంచనా వేశారు. ప్రపంచ వాణిజ్య మార్కెట్‌లో చైనా ఆధిపత్యాన్ని తగ్గించి, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే ప్రణాళికతో అమెరికాలోని ట్రంప్‌ యంత్రాం గం ప్రణాళికలు రచిస్తున్నది. ఇందులో భాగంగా ఈనెలలో చైనాపై పెద్ద మొత్తంలో సుంకాలను విధించిన విషయం విదితమే. దీంతో చైనా ఎగుమతులపై కొంత ప్రభావం పడినా.. అమెరికాకు దీటుగా సమాధానమిస్తూ మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నది.

అమెరికా-చైనా మధ్య ఎగుమతులు తగ్గొచ్చు : డబ్ల్యూటీఓ

చైనాతో పాటు పలు దేశాలపై అమెరికా పరస్పర సుంకాల ఎఫెక్ట్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, మార్కెట్లను కుదేలు చేస్తోందన్న భయాలను ఆయా దేశాల ఆర్థికవేత్తలు, నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్‌ దుందుడుకు నిర్ణయం ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నదని చెప్తున్నారు. అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం ఈ రెండు దేశాల మధ్య వస్తువుల ఎగుమతులు 80 శాతం వరకు తగ్గించొచ్చని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) హెచ్చరించింది. ఇది ప్రపంచ వృద్ధిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని వివరించింది.
అమెరికా సుంకాల ప్రభావం, భయాలు అనేక దేశాలపై ఉన్నాయి. ‘గోల్డ్‌మ్యాన్‌ సాచ్స్‌’ ఈ ఏడాది చైనా జీడీపీ వృద్ధి రేటు అంచనాలను గతవారం 4.5 శాతం నుంచి నాలుగు శాతానికి తగ్గించింది. ఇందుకు టారిఫ్‌ ప్రభావాలను కారణాలుగా చూపించింది. ఇక రెండ్రోజుల క్రితం ‘సిటి’.. 4.7 శాతం నుంచి 4.2 శాతానికి తన అంచనాలను తగ్గించింది. ఈ సవరించిన అంచనాలు ప్రభుత్వ(చైనా) వృద్ధి లక్ష్యం ‘దాదాపు ఐదు శాతం’ కంటే తక్కువగా ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో అంచనాలను మించి జర్మనీ ఎగుమతులు పెరిగాయి. దక్షిన కొరియాలాగే ఈనెలలో యూఎస్‌కు జర్మనీ ఎగుమతులు 8.5 శాతం ఎగబాకాయి. మార్చిలో చైనాకు దక్షిణ కొరియా ఎగుమతులు 4.1 శాతం తగ్గాయి. కొరియన్‌ డేటా ఈ విషయాన్ని వెల్లడించింది.

➡️