సమిష్టితత్వం .. సంక్రాంతి గుణం …

ఊళ్లు జనంతో కళకళ్లాడుతున్నాయి. నిండా నీళ్లు పారుతున్న నదిలా తళతళా మెరుస్తున్నాయి. మనుషుల కళ్ల నిండా కాంతులు కురుస్తున్నాయి. పలకరింపుల పర్వంతో పులకరించిపోతోంది ఊరు. సంక్రాంతి అంటే అందరికీ పండగే కానీ, ఊరికి మరీ ప్రత్యేకం. ఎందుకంటే- ఈ పండక్కి పుట్టుకనిచ్చిందే ఊరు. జన్మనిచ్చిన ఊరిని పలకరించిపోదామని ఏడాదికొకసారి సందడిగా వస్తుంది సంక్రాంతి. ఊరి నుంచి వెళ్లిన పిల్లలను, ఆ పిల్లల పిల్లలను వెంటబెట్టుకొని వేంచేస్తుంది. ఊరందరూ వస్తేనే ఊరంత సంబరమని సంక్రాంతికి తెలుసు. పేరుకే తాను సంక్రాంతి. ఆ కళాకాంతులు తెచ్చేదీ, పెద్ద పండగగా నిలిపేదీ- పల్లె పొదుగున చేరే పిల్లాపెద్దలు అందరూ! తాను వచ్చానని అనేకనేక ఊళ్ల నుంచి, పట్టణాల నుంచి పిల్లాపాపలతో అందరూ ఉత్సాహంగా వస్తారు. వాళ్లంతా అలా రావడంతోనే తాను వచ్చినట్టు అవుతుంది.

సంక్రాంతిని అందరూ ప్రేమిస్తారు. అందరూ అభిమానిస్తారు. పండగ నెపంతో పిల్లలందరూ వస్తారని అమ్మలందరూ ఎదురుచూస్తారు. పండగ పేరుతో తృణమో ఫణమో దక్కుతుందని అక్కడక్కడా మిగిలిన హరిదాసులు, బుడబుక్కలు, కొమ్మ దాసర్లు, గంగిరెద్దుల వారు పాత సరంజామాను సర్దుకొని ప్రతి ఇంటి వాకిట్లో పాటై మోగుతారు. పలుకై వినిపిస్తారు. పండగను వీధివీధినా ఊరేగిస్తున్నందుకు గృహస్తులు ఉత్సాహపడతారు. అమ్మకాలు పెరిగి, ఆదాయం చేకూరుతుందని అన్ని రకాల వ్యాపారులు ముందునుంచీ పండగను కలవరిస్తారు. సెలవులు వచ్చినందుకు పిల్లలు సంతోషపడతారు. అమ్మమ్మ వాళ్ల ఊరు వెళుతున్నందుకు ఉప్పొంగిపోతారు.

రంగురంగుల ముగ్గులతో తమను అందంగా అలంకరిస్తుందుకు వీధులు ముచ్చటపడతాయి. ఏడాది మొత్తంలో ఎప్పుడూ లేనంతమంది అటూ ఇటూ ఉల్లాసంగా తిరుగాడుతున్నందుకు కళకళ్లాడతాయి. అన్ని ఇళ్లూ పిండివంటలతో ఘుమఘుమలాడతాయి. ఏ ఇంటికి వెళ్లినా ఆప్యాయ పలకరింపులు నిండుగా ఉంటాయి. కొత్త అల్లుళ్లకు ప్రత్యేక మర్యాదలు లభిస్తాయి. పెళ్లి సందడిలో అంతగా పట్టించుకోవటం వీలవ్వని బాంధవ్యాలు ఈ పండక్కే బలంగా అల్లుకుంటాయి. అల్లరి పిల్లలకు గొప్ప ధైర్యాన్నిచ్చే పండగ ఇది. అమ్మ గదమాయింపులను, నాన్న క్రమశిక్షణలను లెక్క చేయనవసరం లేదు. అమ్మమ్మ, తాతయ్య, మామయ్య, పెద్దమ్మ, అత్తలు తదితర బహుముఖ బలగం వారికి అండగా ఉంటుంది. ఏది కావాలన్నా, ఏది తినాలన్నా, ఎక్కడ తిరగాలన్నా ఎక్కువ చెల్లుబాటుకు సంక్రాంతి అవకాశం ఇస్తుంది.

ఉపాధి కోసం, ఉద్యోగం కోసం ఎక్కడెక్కడికో తరలిపోయిన మిత్రులంతా వచ్చి వాలతారు. పదిమందీ కలవడం, పాత జ్ఞాపకాలను పలవరించటం సంతోషాల్లోకెల్లా సంతోషకరమైన వ్యాపకం. తిరుగాడిన దారులూ, ఈతకొట్టిన వాగులూ, చదువు నేర్పిన బడులూ, తచ్చాడిన తావులూ … మళ్లీ వచ్చిన మిత్రబృందాలను చూసి పరిమళిస్తాయి. ఆనాటి కథలూ, కలలూ, అల్లరి పనులూ మళ్లీ మళ్లీ ప్రతిధ్వనించి పరవశిస్తాయి. స్నేహితుల, బంధువుల పిల్లలు పరస్పరం పరిచయం అవుతారు. ఆటలతో, మాటలతో మమేకమవుతారు.

కోడిపందాలు, సాంస్క ృతిక కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు, తీర్థాలు, బండలాగుడు వినోదాలు, పశువులకు అలంకరణలు … ఊరినిండా ఉత్సాహ వాతావరణాన్ని నింపుతాయి. అన్ని వయసుల వారికి, అన్ని వీధుల వారికీ కళ్ల నిండా వినోదం, మనసు నిండా ఉత్సాహం ఉరకలెత్తుతాయి. పలకరించుకోవడం, ఇచ్చిపుచ్చుకోవడం, పరస్పరం సహకరించుకోవడం, ఇంటిల్లిపాదీ కలిసి భుజించటం … వంటి సమిష్టితనపు గొప్పతనాన్ని, ఆనందాన్ని సంక్రాంతి అందరికీ పరిచయం చేస్తుంది. పూజలూ పునస్కారాల్లోనో, ఆస్తుల ఆడంబరాల్లోనో కాదు; మనుషులందరూ కలసి మెలసి ఉండడంలోనే సందడి ఉంది. పండగ ఉంది. ఆనందం ఉంది. ఇంత గొప్ప పాఠం చెప్పే సంక్రాంతి నిజంగానే పెద్ద పండగ. ఉత్పత్తిలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ, ప్రతి జీవికి, ప్రతి పరికరానికి ప్రణమిల్లే పండగ. ఏడాది మొత్తానికి ఎనర్జీనిచ్చే పండగ. వచ్చే సంక్రాంతి దాకా ఎదురుచూసేంత ఆనందానుభూతులను ప్రసాదించే పండగ.

– శాంతిమిత్ర

➡️