- రెండింటి మధ్య ఏకాభిప్రాయం
- కేసుల ఉపసంహరణ
న్యూఢిల్లీ : దిగ్గజ మీడియా సంస్థలు జీ-సోనీ సంస్థలు ఎట్టకేలకు రాజీ కుదర్చుకున్నాయి. ఇరు సంస్థల మధ్య నెలకొన్న వివాదం సమిసిపోయింది. జీ-సోనీ మధ్య విలీన ఒప్పందం రద్దు అయిన తర్వాత అనేక వివాదాలు నెలకొన్నాయి. ఒప్పంద రద్దు అనంతరం పరస్పరం పెట్టుకున్న కేసులను ఉపసంహరించుకునేందుకు ఓ నిర్ణయానికి వచ్చినట్లు మంగళవారం ఇరు సంస్థలు వెల్లడించాయి. నష్టపరిహారం కోసం న్యాయ పోరాటాలు చేయాలని రంగంలోకి దిగాయి. సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌తో పాటు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, ఇతర ఫోరమ్స్‌లో పరస్పరం దాఖలు చేసుకున్న న్యాయ పోరాటాలకు ముగింపు పలకాలని అంగీకారానికి వచ్చాయి. ఎవరికి వారు మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ విభాగాల్లో సొంతంగా రాణించడంపై దృష్టి సారించాలని భావించాయి.
2023 ఆగస్టు 10న ఈ రెండు సంస్థలు విలీన ప్రతిపాదనలు చేసుకున్నాయి. జీ ఎంటర్‌టైన్మెంట్‌తో సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా (ప్రస్తుతం కల్వర్ మ్యాక్స్ ఎంటర్‌టైన్మెంట్) 10 బిలియన్ డాలర్లు (రూ.83 వేల కోట్లు) విలీన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ తర్వాత ఇరు సంస్థల మధ్య అభ్యంతరాలు రావడంతో వివాదాలు నెలకొన్నాయి. తాజాగా సమసి పోవడంతో మంగళవారం జీ ఎంటర్‌టైన్మెంట్ సంస్థ షేర్లు ఒక దశలో ఏకంగా 14 శాతం పెరిగాయి. చివరకు 11.56 శాతం లాభంతో ముగిశాయి.