- సెన్సెక్స్ 1250 పాయింట్ల పతనం
- రూ.3.5 లక్షల కోట్ల సంపద ఆవిరి
- రిలయన్స్ ఇండిస్టీస్ షేర్ 3 శాతం క్షీణత
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవి చూశాయి. అమ్మకాల ఒత్తిడితో సోమవారం బిఎస్‌ఇ సెన్సెక్స్ 1250 పాయింట్ల మేర పతనం కాగా.. నిఫ్టీ 50 సూచీ 25,850 దిగువన నమోదయ్యింది. రిలయన్స్ ఇండిస్టీస్, ఐటి, బ్యాంకింగ్ స్టాక్స్‌ల్లో భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో ఒక్క పూటలోనే బిఎస్‌ఇ మార్కెట్ కాపిటలైజేషన్ రూ.3.55 లక్షల కోట్లు ఆవిరయ్యింది. ఇటీవల వరుసగా పెరుగుతూ నూతన గరిష్ఠాలకు చేరిన సూచీల్లో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. మరోవైపు విదేశీ మదుపర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం వల్ల మార్కెట్లలో ప్రతికూలత నెలకొంది.
ఉదయం 85,209 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ సూచీ.. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో ఏకంగా 84,257 కనిష్టాన్ని చవి చూసింది. తుదకు 1272 పాయింట్లు లేదా 1.49 శాతం నష్టంతో 84,299.78కు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 368 పాయింట్లు లేదా 1.41 శాతం నష్టపోయి 25,810.85 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30లో రిలయన్స్ ఇండిస్టీస్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ సూచీలు అధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. రిలయన్స్ షేర్ ఏకంగా 3.23 శాతం లేదా రూ.98.60 పతనమై రూ.2,953.80 వద్ద ముగిసింది. మరోవైపు జెఎస్‌డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్, ఎన్‌టిపిసి, టాటా స్టీల్, టైటాన్, ఏషియన్ పెయింట్స్ షేర్లు మాత్రమే లాభపడిన వాటిలో ఉన్నాయి.
చైనా వైపు ఎఫ్‌ఐఐల దృష్టి
ఇటీవల చైనా ప్రభుత్వం వృద్థికి ఊతం ఇచ్చేలా పలు చర్యలు, విధానాలను ప్రకటించడంతో విదేశీ మదుపర్లు అక్కడి మార్కెట్లపై ఆసక్తిని కనబర్చి ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు పెరిగాయి. దీంతో భారత మార్కెట్లపై ప్రతికూలం పడింది. పశ్చిమసియాలో లెబనాన్‌పై ఇజ్రాయిల్ వరుస దాడుల వల్ల నెలకొన్న భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు మదుపర్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి. బిఎస్‌ఇ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.81 శాతం, 0.75 శాతం చొప్పున నష్టపోయాయి. బిఎస్‌ఇ మార్కెట్ కాపిటలైజేషన్ రూ.3.55 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.474.38 లక్షల కోట్ల వద్ద ముగిసింది.