సెన్సెక్స్ 200 పాయింట్ల పతనం
నేడు హోలి సెలవు
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లలో సానుకూల అంశాలు కానరావడం లేదు. వరుసగా ఐదో సెషన్‌లోనూ నష్టాలు చవి చూశాయి. అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలకు తోడు దేశీయంగా ఆర్ధిక వ్యవస్థలో ఎలాంటి మద్దతు కానరాకపోవడంతో గురువారం బిఎస్‌ఇ సెన్సెక్స్ 201 పాయింట్లు లేదా 0.27 శాతం పతనమై 73,828.91కి పడిపోయింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 73 పాయింట్లు లేదా 0.33 శాతం కోల్పోయి 22,397 వద్ద ముగిసింది.
హోలి సందర్భంగా శుక్రవారం స్టాక్ మార్కెట్లకు సెలవు కావడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాల వల్ల ఎప్పుడేం జరుగుతోందోనన్న భయాలు ప్రపంచ మార్కెట్లను వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా కొనుగోళ్లకు మదుపర్లు ఆసక్తి చూపడం లేదని బ్రోకర్లు పేర్కొంటున్నారు. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్ సూచీలు.. ఇంట్రాడేలో ఆ లాభాలను కోల్పోయాయి.
బిఎస్‌ఇలో మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.77 శాతం, 0.62 శాతం చొప్పున నష్టపోయాయి. ఈ ఒక్క సెషన్‌లోనే మదుపర్లు దాదాపు రూ.2 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. బిఎస్‌ఇలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాపిటలైజేషన్ రూ.393 లక్షల కోట్ల నుంచి రూ.391 లక్షల కోట్లకు పడిపోయింది. డాలరుతో రూపాయి మారకం విలువ 22 పైసలు బలపడి 87 వద్ద ముగిసింది. సెన్సెక్స్- 30 సూచీలో జొమాటో, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు అధికంగా నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు ఎస్‌బిఐ, ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్‌టిపిసి, సన్‌ఫార్మా, టాటా స్టీల్ షేర్లు అధికంగా లాభపడిన వాటిలో టాప్‌లో ఉన్నాయి. దాదాపు 300 స్టాక్స్ 52 వారాల కనిష్ట స్థాయిని తాకాయి.
