ధీరజ్‌ వాధ్వాన్‌ అరెస్ట్‌

May 14,2024 22:03 #arest, #Business
  • బ్యాంక్‌లకు రూ.34వేల కోట కన్నం కేసు
  • సిబిఐ కస్టడికి డిహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లు

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌ మోసం కేసులో డిహెచ్‌ఎఫ్‌ఎల్‌ మాజీ డైరెక్టర్‌ ధీరజ్‌ వాధ్వాన్‌ను సిబిఐ అరెస్టు చేసింది. రూ.34వేల కోట్ల మోసం కేసులో వాధ్వాన్‌ను సోమవారం సాయంత్రం ముంబయిలో అదుపులోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు. మంగళవారం ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచామని.. ఆ తర్వాత జ్యుడీషియల్‌ కస్టడీకి పంపామని వెల్లడించారు. దేశ బ్యాంకింగ్‌ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా నిలిచిన ఈ కేసుకు సంబంధించి 2022లో సిబిఐ అతడిని చార్జిషీట్‌లో చేర్చింది. యెస్‌ బ్యాంక్‌ అవినీతి కేసులో గతంలోనే వాధ్వాన్‌ను సిబిఐ అరెస్టు చేయగా.. బెయిల్‌పై బయట ఉన్నారు.
17 బ్యాంకుల కన్సార్టియంను మోసం చేశారన్న ఆరోపణలపై డిహెచ్‌ఎఫ్‌ఎల్‌పై సిబిఐ కేసు నమోదు చేశామని.. ఇది దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్‌ రుణ మోసంగా నిలిచిందని అధికారులు తెలిపారు. యుబిఐ ఆధ్వర్యంలోని 17 బ్యాంకుల కన్సార్షియాన్ని 2010-18 మధ్య కాలంలో డిహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లు రూ.34,615 కోట్లకు మోసం చేసిన విషయం 2020లో బయటపడింది. 2019లోనే ఈ రుణాలు నిరర్ధక ఆస్తులుగా మారాయి. యూనియన్‌ బ్యాంక్‌ 2021లో నమోదు చేసిన ఫిర్యాదు ఆధారంగా డిహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లు కపిల్‌, ధీరజ్‌ వాధ్వాన్‌లపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఇప్పటి వరకు దేశంలో నీరవ్‌ మోడీ రూ.13వేల కోట్లు, ఎబిజి షిప్‌యార్డ్‌ రూ.23వేల కోట్లకు బ్యాంక్‌లను ముంచిన కేసులు.. అతిపెద్ద బ్యాంకింగ్‌ కుంభకోణాలుగా ఉన్నాయి.
క్రిమినల్‌, కుట్ర ఆరోపణలలో భాగంగా కపిల్‌ వాధ్వాన్‌, సిఎండి ధీరజ్‌ వాధ్వాన్‌, డైరెక్టర్‌, ఆరు రియాల్టీ కంపెనీలపై సిబిఐ కేసు బుక్‌ చేసి విచారణ జరుపుతుంది. అంతేకాక బ్యాంకులు ఇచ్చిన నిధులను కంపెనీ ప్రమోటర్లు దారి మళ్లించారనే ఆరోపణలు వచ్చాయి. కపిల్‌, ధీరజ్‌ వాధ్వాన్‌లు నిధులను దారి మళ్లించి, ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, సొంత ఆస్తులను పెంచుకున్నారని ప్రధాన అరోపణ.

➡️