- 69 శాతం ఇన్‌ప్లుయెన్సర్ల ఉల్లంఘనలు
- ఫ్యాఫన్ బ్రాండ్స్‌లోనే ఎక్కువ మోసాలు
- ఎఎస్‌సిఐ రిపోర్ట్‌లో వెల్లడి
ముంబయి : డిజిటల్ స్టార్లుగా చెప్పుకుంటున్న ఇన్‌ఫ్లుయెన్సర్లు వినియోగదారులను భారీగా తప్పుదోవ పట్టిస్తున్నారు. వాస్తవ నిబంధనలకు విరుద్దంగా వ్యవహారస్తున్నారని అడ్వర్టైజింగ్ స్లాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎఎస్‌సిఐ) వెల్లడించింది. మూడింట రెండొంతుల మంది లేదా 69 శాతం మంది నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతూ.. వినియోగదారులను ముంచేస్తోన్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 డిజిటల్ స్టార్స్ 2024’ జాబితాలో పేర్కొన్న ఇన్‌ఫ్లుయెన్సర్ల తీరును పరిశీలించి ఎఎస్‌సిఐ ఓ రిపోర్ట్‌ను రూపొందించింది. 2024 సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యకాలంలో వారు ఇన్‌స్ట్రాగాం, యూట్యూబ్‌లో ప్రమోట్ చేసిన పోస్టులను పరిశీలించింది. ఈ టాప్ ఇన్‌ప్లుయెన్సర్స్‌ను దాదాపు 11 కోట్ల మంది అనుసరిస్తున్నారు
ఎఎస్‌సిఐ రిపోర్ట్ ప్రకారం.. సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సిసిపిఎ) నిబంధనల ప్రకారం.. ఉత్పత్తులు, బ్రాండ్ ప్రమోషన్ సమయంలో కీలక వివరాలను వినియోగదారులకు వెల్లడించడంలో 69 శాతం మంది విఫలమవుతున్నారు. 100 పోస్టుల్లో 29 మాత్రమే తగినన్ని వివరణలతో కూడినవి ఉంటున్నాయి. 69 కేసుల్లోనూ ఉల్లంఘనలు నిరూపించబడ్డాయి. ముఖ్యంగా ఫ్యాషన్, లైఫ్‌స్టయిల్, టెలికం ఉత్పత్తులు, పర్సనల్ కేర్ విభాగాల్లో 62 శాతం మంది ఇన్‌ప్లుయెన్సర్లు తప్పుదోవ పట్టించే పోస్టులు పెడుతున్నారు.
ఇన్‌ప్లుయెన్సర్ల ప్రకటనల్లో పారదర్శకత లోపించడం, నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తుండటం ఆందోళనకరమైన విషయమని ఎఎస్‌సిఐ రిపోర్ట్‌లో పేర్కొంది. నియంత్రణ సంస్థల చర్యలకు గురికాకుండా ప్రకటనకర్తలు, ఏజెన్సీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు సమష్టిగా నిబంధనలకు అనుగుణంగా పని చేయడంపై దృష్టి పెట్టాలని ఎఎస్‌సిఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్, సెక్రటరీ జనరల్ మనిషా కపూర్ పేర్కొన్నారు. టాప్ ఇన్‌ప్లుయెన్సర్లు కూడా నిబంధనలు, పారదర్శకతకు కట్టుబడిలేకపోవడం నిరాశకు గురి చేస్తోందన్నారు.