పన్నులు తగ్గించమనొద్దు

  • పరిశ్రమ వర్గాలతో మంత్రి నితిన్‌ గడ్కరీ

న్యూఢిల్లీ : పన్నులను తగ్గించాలని పారిశ్రాకవేత్తలు అడుగవద్దని రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి గడ్కరీ మాట్లాడుతూ.. పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వానికి నగదు అవసరం అవుతుందన్నారు. వచ్చే రెండేళ్లలో భారత్‌లో రవాణ వ్యయాలు 9 శాతానికి తగ్గొచ్చన్నారు. జిఎస్‌టి, ఇతర పన్నులు తగ్గించాలని డిమాండ్‌ చేయకూడదన్నారు. ఒక్కసారి పన్నులు తగ్గిస్తే మరింత డిమాండ్‌ చేస్తారన్నారు. ఇది మానవ లక్షణం అన్నారు. తాము పన్నులను తగ్గించాలని అనుకుంటున్నామని.. కానీ పన్నులు లేకుండా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయలేదని గడ్కరీ పేర్కొన్నారు. ధనవంతుల నుంచి పన్నులు తీసుకొని పేదలకు ప్రయోజనాలు కల్పించడమే ప్రభుత్వ దార్శనికత అని.. ప్రభుత్వానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయన్నారు. ప్రస్తుతం దేశంలో రవాణ ఖర్చు 14-16 శాతంగా ఉందని.. రాబోయే రెండేళ్లలో ఇది 9 శాతానికి తగ్గనుందన్నారు. చైనాలో లాజిస్టిక్స్‌ ఖర్చు 8శాతం ఉండగా.. అమెరికా, యూరోపియన్‌ దేశాల్లో ఇది 12 శాతంగా ఉందన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా భారత పరిశ్రమ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని సూచించారు. మూలధన పెట్టుబడిని పెంచడం ద్వారా భారతదేశం మరిన్ని ఉద్యోగాలను సృష్టించబోతుందన్నారు.

➡️