దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. అమెరికా టారిఫ్‌ల ప్రకటనలు, ఆ దేశంలో నిరుద్యోగిత పెరగడం లాంటి పరిణామాలతో మదుపర్లు అప్రమత్తతను కొనసాగిస్తున్నారు. దీంతో మార్కెట్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 230 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 23,350 దిగువన ట్రేడింగ్‌ మొదలుపెట్టింది. ఉదయం 9 :30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 388 పాయింట్లు నష్టంతో 73,726వద్ద.. నిఫ్టీ 113 పాయింట్లు కుంగి 22,346 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, జమాటో, ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ఫిన్‌సర్వ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, సన్‌ఫార్మా, మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, ఐటీసీ, హెచ్‌యూఎల్‌ షేర్లు మాత్రమే లాభాల్లో కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 70 డాలర్ల దిగువన ట్రేడవుతోంది. బంగారం ఔన్సు 2,899.60 డాలర్ల వద్ద కదలాడుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 87.38 వద్ద కొనసాగుతోంది.

కుదేలైన అమెరికా మార్కెట్లు
అమెరికా మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఎస్‌అండ్‌పీ సూచీ 2.69 శాతం, డోజోన్స్‌ 2.08 శాతం కుంగగా.. నాస్‌డాక్‌ ఏకంగా 4 శాతం నష్టపోయింది. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నేడు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ 0.78 శాతం, జపాన్‌ నిక్కీ 1.74 శాతం నష్టంతో కదలాడుతుండగా.. షాంఘై, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం నికరంగా రూ.485 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు నికరంగా రూ.264 కోట్ల షేర్లు కొనుగోలు చేశారు. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నేడు ట్రేడింగ్‌ సెషన్‌లో ఏకంగా 10 శాతం నష్టపోయాయి. బ్యాంక్‌కు చెందిన డెరివేటివ్‌ పోర్ట్‌ఫోలియోలో అవకతవకలు ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో షేర్లు పతనమయ్యాయి. దీనికితోడు ప్రస్తుత సీఈఓ సుమంత్‌ కత్పలియా పదవీకాలాన్ని మూడేళ్లు కాకుండా, ఒక సంవత్సరం పాటే పొడిగించేందుకు ఆర్‌బీఐ అనుమతించింది. ఈ నిర్ణయం కూడా షేర్లపై ప్రభావం చూపింది.

➡️