ఆర్గానికి ఎరువుల్లో రెండంకెల వృద్థి

Jun 8,2024 21:12 #Business, #fertilizers, #organic
  • రైతుల్లో మరింత అవగాహన పెరగాలి
  • జియోలైఫ్‌ అగ్రిటెక్‌ ఉత్పత్తులతో మెరుగైన దిగుబడి
  • కంపెనీ సిఎండి వినోద్‌ లహోటి వెల్లడి

ప్రజాశక్తి – బిజినెస్‌ బ్యూరో : దేశంలో ఆర్గానికి ఎరువుల వాడకంలో రెండంకెల పెరుగుదల ఉందని జియోలైఫ్‌ అగ్రిటెక్‌ ఇండియా ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సిఎండి) వినోద్‌ లహోటి అన్నారు. ఈ రంగం ప్రతీ ఏడాది 10.6 శాతం వృద్థిని నమోదు చేస్తుందన్నారు. అదే రసాయన ఎరువుల రంగం 6 శాతం చొప్పున పెరుగుతోందన్నారు. రైతులు, ప్రజల్లో ఆర్గానిక్‌ ఉత్పత్తులపై మరింత అవగాహన పెంచడానికి తాము ప్రత్యేకంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అదే విధంగా పలు ఆర్గానిక్‌ ఎరువుల పోర్టుపోలియోను పెంచుతున్నామన్నారు. ఇందుకోసం పూణెలోని తమ ఐదున్నర ఎకరాల్లోని పరిశోధన, అభివృద్థి (ఆర్‌అండ్‌డి) సెంటర్‌ కృషి చేస్తుందన్నారు. తమ పోర్టుపోలియోలో 50కి పైగా ఉత్పత్తులు ఉన్నాయన్నారు. గత ఒక్క ఏడాదిలోనే 12 ఉత్పత్తులను ఆవిష్కరించామన్నారు.
గడిచిన ఆర్థిక సంవత్సరం 2023-24లో రూ.182 కోట్ల టర్నోవర్‌ సాధించామన్నారు. ఈ ఏడాది రూ.250 కోట్ల రెవెన్యూ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 40 దేశాలకు ఎగుమతులు చేస్తున్నామన్నారు. దేశంలో తమకు 3వేల పైగా విక్రయ భాగస్వాములు ఉన్నారని తెలిపారు.
అహార నాణ్యత ప్రమాణాలను పెంచడానికి స్పెషాలిటీ న్యూట్రియంట్‌ టెక్నాలజీని తీసుకొచ్చామన్నారు. ఇప్పుడు ప్రజలు తీసుకునే ఆహారంలో ఎక్కువగా రసాయనాలు ఉంటున్నాయని.. పోషకాలు తక్కువగా ఉంటున్నాయన్నారు. దీన్ని తమ టెక్నాలజీ ఉత్పత్తులతో మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందుకోసం తాము బాక్టోగ్యాంగ్‌, కార్బన్‌ స్టోన్‌ సహా పలు ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చామన్నారు. వీటి ధరలను వరుసగా రూ.600, రూ.900గా నిర్ణయించామన్నారు. ఇవి భూమిలో సారవంతాన్ని పెంచడంతో పాటుగా.. ధాన్యంలో నాణ్యతను పెంచుతాయన్నారు. జియోలైఫ్‌ అగ్రిలో 600 పైగా ఉద్యోగులు పని చేస్తున్నారన్నారు. తమ అమ్మకాలను మరింత విస్తృతం చేయడానికి ఇటీవల నేషనల్‌ సేల్స్‌ మేనేజర్‌గా విశేష అనుభవం కలిగిన చక్రపు కిరణ్‌ కుమార్‌ను, నేషనల్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌గా అరుణ్‌ కుమార్‌ రారును నియమించుకున్నామని తెలిపారు.

➡️