- పడిపోతున్న పట్టణ వినిమయం
- పెరుగుతున్న కుటుంబ రుణ భారాలు
- హెచ్చు వడ్డీ రేట్లతో ఒత్తిడి
- స్టాక్ మార్కెట్ల కుదేలు..
ప్రజాశక్తి – బిజినెస్ డెస్క్ : భారత ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఛాయలు కొట్టచ్చినట్లు కనబడుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక వేగంగా వృద్థి చెందుతోన్నామని బిజెపి పాలక వర్గాల ప్రచారానికి.. వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండా పోయింది. దేశంలోని పట్టణ ప్రజల్లో వినియమం తగ్గడం, కార్పొరేట్ల ఆదాయాల్లోనూ పతనం చోటు చేసుకుంటుంది. అధిక వడ్డీ రేట్లు, హెచ్చు పన్నులకు తోడు కుటుంబ రుణ భారాలు పెరిగిపోతూ.. వ్యక్తిగత రుణాలు చెల్లించలేని పరిస్థితులు పెరుగుతున్నాయి. వెరసీ ఈ ప్రభావం కార్పొరేట్ కంపెనీల అమ్మకాలపై పడుతోంది. దీంతో ఇటీవల సెప్టెంబర్ త్రైమాసికంలో అనేక కంపెనీల ఆదాయాలు భారీగా పడిపోయాయి. మరోవైపు దలాల్ స్ట్రీట్ అమ్మకాల ఒత్తిడితో బెంబెలెత్తుతోంది. స్టాక్ మార్కెట్లలో పండుగ వాతావారణం ఆవిరై మదుపర్లు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిణామాలన్నీ మాంద్యానికి సంకేతాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మధ్యతరగతి కొన లేరు..
ఆదాయాలు తగ్గడంతో పట్టణ వినిమయం భారీగా పడిపోతోంది. ముఖ్యంగా అధిక వడ్డీ రేట్లు, హెచ్చు ద్రవ్యోల్బణంతో చిన్న మొత్తాల రుణాలు పొందిన వారు తిరిగి సకాలంలో చెల్లించలేకపోతున్నారు. ఉద్యోగులు, కార్మికుల వేతనాల్లోనూ పెంపుదల అంతంత మాత్రమే ఉంటుంది. సెప్టెంబర్ త్రైమాసికంలో విత్తయేతర కార్పొరేట్ కంపెనీలు తమ సిబ్బంది వేతన వ్యయాలను 0.8 శాతమే పెంచాయి. ఇంతక్రితం జూన్ త్రైమాసికంలో 1.2 శాతం పెంపుదల ఉంది. దీని ప్రభావాలు ఇప్పుడు అన్ని రంగాలపై కనబడుతోందని నెస్లే ఇండియా సిఇఒ సురేష్ నారాయణన్ పేర్కొన్నారు. ప్రీమియం వినియోగం బలంగానే ఉన్నప్పటికీ.. మధ్యస్థ విభాగంలో ఒత్తిడి నెలకొందన్నారు. గడిచిన సెప్టెంబర్ త్రైమాసికంలో తమ అమ్మకాల్లో కేవలం 1.4 శాతం పెరుగుదల మాత్రమే ఉందన్నారు. గత రెండేళ్లలో ఇదే అత్యల్ప వృద్థి రేటు అన్నారు. పండగ సీజన్‌లో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యువి) విభాగంలో అమ్మకాలు పడిపోయి 7 లక్షల కార్లు నిల్వ ఉండిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మైక్రోఫైనాన్స్ రుణాల జారీలోనూ పతనం పెరిగి ంది. ఈ పరిణామాలు మధ్యతరగతి ప్రజల్లో ఆదాయాల పతనాన్ని, మందగమనాన్ని స్పష్టం చేస్తున్నాయి.
జిడిపి డౌన్..
ప్రపంచంలోనే వేగంగా పెరుగుతోన్న ఆర్థిక వ్యవస్థగా చెప్పుకుంటున్న భారత్‌లో అన్ని రంగాల కంపెనీల్లో మందగమనం వైరస్ క్రమంగా పుంజుకుంటుంది. బజాజ్ ఆటో, మారుతి సుజుకి, హిందుస్తాన్ యూనిలీవర్, నెస్ల్టే తదితర సహా చిన్న బ్యాంక్‌లు, ఎన్‌బిఎఫ్‌సిలు ఆదాయాలను కోల్పోతున్నాయి. ఆర్థిక సంవత్సరం 2023-24లో 8.2 శాతం వృద్థిని నమోదు చేసిన భారత్ ప్రస్తుత 2024-25 తొలి త్రైమాసికంలో జిడిపి 6.7 శాతానికి పరిమితమయ్యింది. రెండో త్రైమాసికంలో వృద్థి రేటు అంచనాలను 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తూ ఆర్‌బిఐ అంచనా వేసింది. 2024-25లో 7.2 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. భారత వృద్థి 6.5 శాతానికి పరిమితం కావొచ్చని గోల్డ్‌మాన్ సాచే అంచనా వేసింది.
వాహన అమ్మకాలు డీలా..
ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులకు ప్రధాన గీటురాయిగా చూసే వాహన అమ్మకాల్లోనూ పతనం చోటు చేసుకుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ అక్టోబర్ 28న వెల్లడించిన రిపోర్ట్ ప్రకారం.. ఎఫ్‌ఎడిఎ గణంకాలను ఉదహరిస్తూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ప్రథమార్థంలో వాహన అమ్మకాలు 2.3 శాతం తగ్గాయని వెల్లడించింది. రెండో త్రైమాసికంలో పట్టణ అమ్మకాల్లో తగ్గుదలనే ప్రధాన కారణమని పేర్కొంది. మరోవైపు ఎఫ్‌ఎంసిజి అమ్మకాల పెరుగుదల 2.8 శాతానికి క్షీణించాయి. ఈ రంగం గతేడాది ఇదే త్రైమాసికంలో 10.1 శాతం వృద్థిని సాధించింది.
దలాల్ స్ట్రీట్‌లోనూ నిరాశలు..
గడిచిన నెల రోజులుగా దలాల్ స్ట్రీట్‌పై బేర్ పంజా కొనసాగుతోంది. అమ్మకాల ఒత్తిడితో రిటైల్ ఇన్వెస్టర్లు భారీ నష్టాలను చవి చూస్తున్నారు. భారత మార్కెట్ నుండి భారీగా ఎఫ్‌ఐఐలు తరలిపోవడమూ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లకు నిదర్శనం. బెర్న్‌స్టెయిన్ ఇండియా స్ట్రాటజీ రిపోర్ట్ ప్రకారం.. ”నిఫ్టీ 100లోని కంపెనీలు దాదాపు 48 శాతం తమ అంచనాలను కోల్పోయాయి. ఇది మార్చి 2020 తర్వాత అత్యధికం. ఇప్పుడు మార్కెట్లలో ఉత్సాహం (పార్టీ) ముగుస్తోంది. నిఫ్టీ 50 ఆల్‌టైం గరిష్టాల నుంచి 10 శాతం పతనమయ్యింది. ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థతో ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ఓ కారణం. భారత్‌లోని హెచ్చు ద్రవ్యోల్బణం, తక్కువ వేతనాల పెరుగుదల మార్కెట్లపైనా ప్రతిబింబిస్తుంది. గతంలో ఏడాదికి 30 శాతం రాబడిని అందుకున్న ఇన్వెస్టర్లు వచ్చే ఏడాది ఒక్క అంకె స్థాయిలోనే రాబడి పొందే అవకాశం ఉంది.” అని బెర్న్‌స్టెయిన్ రిపోర్ట్ పేర్కొంది.
రెండంకెల్లో షేర్ల పతనం
ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుంటున్న బలహీనతల నేపథ్యంలో దలాల్ స్ట్రీట్‌లో దిగ్గజ కంపెనీల షేర్లు బేర్‌మంటున్నాయి. నిఫ్టీ50లో ఆల్‌టైం గరిష్టాలను చవి చూసిన స్టాక్స్ నేల చూపులు చూస్తున్నాయి. కొన్ని స్టాక్స్ అథోపాతాలానికి పడిపోతున్నాయి. దీంతో వీటిల్లో పెట్టుబడులు పెట్టిన సగటు రిటైల్ ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళనకు గురైతున్నారు. కొత్త పెట్టుబడులు పడిపోతున్నాయి. నవంబర్ 4 నాటి మార్కెట్ వివరాల ప్రకారం పరిశీలిస్తే అనేక కంపెనీల షేర్లు రెండంకెల స్థాయిలో క్షీణించాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ ఈ ఏడాది ఆల్‌టైం గరిష్ట స్థాయి రూ.3,435 వద్ద నమోదు కాగా.. 16 శాతం పతనమై రూ.2,897కు పడిపోయింది. ఆసియన్ పేయింట్స్ స్టాక్ 15 శాతం విలువ కోల్పోయి రూ.2,915 వద్ద నమోదయ్యింది. ఇండుస్‌ఇండ్ బ్యాంక్ ఏకంగా 37 శాతం, మారుతి సుజుకి 19 శాతం, హీరో మోటో కార్ప్ 23 శాతం, టాటా మోటార్స్ 30 శాతం, యాక్సిస్ బ్యాంక్ 15 శాతం, హిందుస్థాన్ యూనిలీవర్ 17 శాతం, కొటాక్ మహీంద్రా బ్యాంక్ 11 శాతం, నెస్ల్ల్టే ఇండియా 19 శాతం, టిసిఎస్ 14 శాతం చొప్పున నష్టపోయాయి.
డిమాండ్ లేమీ..
గడిచిన రెండున్నరేళ్లలో ఆర్‌బిఐ ఒక్క సారి కూడా వడ్డీ రేట్లను తగ్గించలేదు. అంతక్రితం వరుసగా 2.50 శాతం మేర పెంచి రెపోరేటును 6.50 శాతానికి చేర్చింది. దీంతో రుణ గ్రహీతలపై తీవ్ర భారం పడుతోంది. మరోవైపు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్ట్ కాలంలో భారత సరుకుల ఎగుమతుల్లో కేవలం 1.1 శాతం పెరుగుదల మాత్రమే ఉంది. ఇది ఉద్యోగాల కల్పనకు ఏమాత్రం సరిపోదు. గడిచిన రెండు త్రైమాసికాల్లో డిమాండ్ లేమితో సిమెంట్, ఇనుము, ఉక్కు, రసాయనాల లాంటి ప్రధాన రంగాలు ప్రతికూల వృద్థిని చవి చూడటం ఆందోళనకరం. తయారీ రంగంలోనూ డిమాండ్ సన్నగల్లింది. ఏడాది క్రితంతో పోల్చితే వినియోగదారుల్లో విశ్వాసం సన్నగిల్లిందని అనేక సర్వేలు చెబుతున్నాయి. ఈ పరిణామాలు ఆర్థిక వ్యవస్థలో తీవ్ర ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయని స్పష్టమవుతోంది.