ప్రయివేటు ఇన్సూరెన్స్‌ కంపెనీల చెలగాటం

  • వైద్య బీమా క్లెయిమ్‌ 80 శాతం లోపే చెల్లింపు
  • 18 శాతం కేసుల నిరాకరణ శ్రీ ప్రభుత్వ సంస్థలు భేష్‌

న్యూఢిల్లీ : దేశంలోని ప్రయివేటు వైద్య బీమా కంపెనీలు పాలసీదారులతో చెలగాటం అడుతోన్నాయి. బీమా ఇచ్చే సమయంలో క్యాష్‌లెస్‌, మొత్తం మేమే భరిస్తామని చెప్పుతూ పాలసీలు చేపిస్తున్నాయి. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో పాలసీదారు అనారోగ్యంతో హాస్పిటల్‌ పాలు అయితే చెల్లింపుల్లో కొసర్లు, కోతలు పెడుతున్నాయి. మొత్తం బిల్లింగ్‌లో 80 శాతం లోపే భరిస్తున్నాయి. మిగితా మొత్తం భారం పాలసీదారులపై పడేస్తున్నాయి. దేశంలోని 20 ప్రయివేటు వైద్య బీమా కంపెనీలు 2023లో 80 శాతం లోపే క్లయిమ్‌ మొత్తం చెల్లింపులు చేశాయి. అంటే హాస్పిటల్‌లో రూ.1 లక్ష బిల్లు అయితే కేవలం రూ.80వేలు మాత్రమే చెల్లించాయి. మిగితా రూ.20వేలు పాలసీదారు చెల్లించాల్సి వచ్చింది. వైద్య బీమా చెల్లింపులు, పరిష్కారాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు మెరుగైన పనితీరును కనబర్చాయి. గరిష్టంగా 98 శాతం మేర చెల్లింపులు చేసిన సంస్థలు ఉన్నాయి. ఇన్సూరెన్స్‌ బ్రోకర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐబిఎఐ) రిపోర్ట్‌ ప్రకారం.. ప్రభుత్వ రంగంలోని న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ మాత్రం ఏకంగా 98.74 శాతం మొత్తం చెల్లిస్తూ టాప్‌లో ఉండటం విశేషం. మరో పిఎస్‌యు ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కూడా సగటున 97.35 శాతం మొత్తాన్ని చెల్లించింది. ప్రయివేటు రంగంలోని హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో సగటున 71.35 శాతం మొత్తం క్లెయిమ్‌ చెల్లింపులు చేసింది. ఐసిఐసిఐ లంబార్డ్‌ 63.98 శాతం చెల్లించగా.. ఈ రంగంలో మార్కెట్‌ లీడర్‌గా ఉన్న స్టార్‌ హెల్త్‌ మాత్రం 54.61 శాతం క్లెయిమ్‌ చెల్లింపులు చేయడం గమనార్హం. ఆరోగ్య బీమా వ్యాపారంలోని 29 బీమా సంస్థలలో కేవలం నాలుగు బీమా కంపెనీలు మాత్రమే 2023 సంవత్సరంలో 90 శాతం కంటే ఎక్కువ క్లెయిమ్‌ చెల్లింపు నిష్పత్తిని (క్లెయిమ్‌ల సంఖ్యపై) కలిగి ఉన్నాయి. దాదాపు పది బీమా సంస్థలు 80 శాతం కంటే తక్కువ క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌లను కలిగి ఉన్నాయి.
ప్రభుత్వ రంగంలోని న్యూ ఇండియా అస్యూరెన్స్‌ క్లెయిమ్‌ చెల్లింపుల నిష్పత్తిలో 95.04 శాతంతో ముందంజలో ఉంది. ఆదిత్య బిర్లా హెల్త్‌ 94.52 శాతం, ఇఫ్కో టోకియో 91.70 శాతం, బజాజ్‌ అలియాంజ్‌ 90.29 శాతంతో క్లెయిమ్‌ చెల్లింపు నిష్పత్తులతో ముందు వరుసలో ఉన్నాయి. ప్రయివేటు బీమా కంపెనీలు క్లెయిమ్‌ చెల్లింపుల్లో 5-18 శాతం వరకు నిరాకరిస్తున్నాయి. 2022-23లో సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు 2.36 కోట్ల ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను పరిష్కరించాయి. ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల పరిష్కారానికి రూ.70,930 కోట్లు చెల్లించాయి. ఒక్కో క్లెయిమ్‌కు చెల్లించిన సగటు మొత్తం రూ.30,087గా ఉంది. స్థూలంగా 75 శాతం క్లెయిమ్‌లు మాత్రమే పరిష్కరించబడ్డాయి. అంటే మరో 25 శాతం క్లెయిమ్‌లు నిరాకరణకు గురైయ్యాయి. మొత్తం క్లెయిమ్‌లలో 56 శాతం నగదు రహిత విధానంలో, మరో 42 శాతం రీయింబర్స్‌మెంట్‌ విధానంలో పరిష్కరించబడ్డాయి. గడిచిన 2023-24కు సంబంధించి బీమా క్లెయిమ్‌ రిపోర్ట్‌ విడుదల కావాల్సి ఉంది.

➡️