ప్రజలపై భారాలు!
ఎలక్ట్రానిక్, వాహన ఉత్పత్తులు మరింత ప్రియం
విదేశీ విద్య, ప్రయాణం కష్టమే, చమురు మంటే.. ఐదేళ్లలో రూపీ 20 శాతం పతనం
ప్రజాశక్తి – బిజినెస్ డెస్క్ : విశ్వగురుగా చెప్పుకొంటున్న ప్రధాని నరేంద్ర మోడీ హయంలో ప్రపంచ మార్కెట్‌లో రూపాయి విలువ రికార్డ్ పతనాన్ని చవి చూస్తోంది. చరిత్రలో ఇది వరకూ ఎప్పుడూ లేని విధంగా రూపీ క్షీణించడంతో పేద, సామాన్య, ధనిక భారతీయులందరిపై ప్రత్యక్షంగా.. పరోక్షంగా తీవ్ర ప్రభావం చూపనుంది. మంగళవారం అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు క్షీణించి 85.20 కనిష్ట స్థాయికి దిగజారింది. వరుస పతనంతో రూపాయి చరిత్రలోనే అత్యంత పేలవ ప్రదర్శనను కనబర్చుతోంది. గడిచిన ఐదేళ్లలో ఈ కరెన్సీ 20 శాతం పైగా పడిపోయింది. భవిష్యత్తు రోజుల్లో ఇది మరింత క్షీణించొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత ఆర్థిక విధానాలతో దేశంలో ఇప్పటికే అధిక ధరలు బెంబేలెత్తిస్తున్న తరుణంలో కరెన్సీ క్షీణత ద్రవ్యోల్బణానికి మరింత ఆజ్యం పోయనుందని హెచ్చరిస్తున్నారు. హెచ్చు ధరలతో ప్రజల ఆదాయం పడిపోనుంది. వస్తువులకు డిమాండ్ తగ్గి, అంతిమంగా ఇది తీవ్ర ఆర్థిక సంక్షోభానికి దారి తీయనుంది.
డిసెంబర్ నెల ముగుస్తుండటంతో దేశీయ మార్కెట్‌లోని దిగుమతిదారులపై చెల్లింపుల ఒత్తిడి ఉంటుందని దీంతో డాలర్లకు డిమాండ్ పెరిగి రూపాయి విలువను మరింత బలహీనపరుస్తుందని ఫారెక్స్ ట్రేడర్లు విశ్లేషిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరిలో బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో మళ్లీ సుంకాల యుద్ధం మొదలవుతుందన్న అంచనాలు గట్టిగానే వినపడుతున్నాయి. ఫలితంగా ముందు జాగ్రత్తగా డాలర్ల కొనుగోళ్ల కోసం భారతీయ దిగుమతిదారులు ఎగబడుతున్నారు. దేశీయ మార్కెట్ల నుంచి ఆగని విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహరణలు రూపాయి పరిస్థితుల్ని మరింత దిగజార్చుతున్నాయి. ట్రంప్ గెలుపొందినప్పటి నుంచి డాలర్‌కు డిమాండ్ పెరగడంతో గడిచిన మూడు నెలల్లోనే ఆర్‌బిఐ వద్ద విదేశీ మారకం నిల్వలు 50 బిలియన్ డాలర్లు తరిగిపోయాయి.
దేశీయ కరెన్సీ వరుస పతనం వల్ల ముఖ్యంగా దిగుమతి ఉత్పత్తులు భారంగా మారనున్నాయి. విదేశీ విద్య, అంతర్జాతీయ ప్రయాణాలు. వాహనాలు, ఎలక్టాన్రిక్ ఉపకరణాలు, చమురు, బంగారం, వంటనూనెలు, పప్పు దినుసులు తదితరాల ధరలు మరింత పెరుగుతాయి. విదేశాల్లో చదువుకునే భారతీయ విద్యార్థులు విద్య, వీసాలు, వసతి కోసం భారీగా చెల్లించాల్సి వస్తుంది. అదానీ కోసం కేంద్రం భారీగా బగ్గు దిగుమతులకు అనుమతిస్తోన్న విషయం తెలిసిందే. ఈ రంగానికి అధికంగా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఆ బగ్గుతో ఉత్పత్తి చేసిన విద్యుత్ భారం కానుంది. దేశం మొత్తం చమురు వినియోగంలో 85 శాతం దిగుమతుల నుంచి సమకూర్చుకుంటున్నదే.. చమురు దిగుమతులపై భారీగా చెల్లింపులు జరుగుతున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగనున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీనంగా ఉండటంతో ఇప్పటికే వాణిజ్య లోటు అమాంతం పెరుగుతోంది. ఈ పరిణామాలు భారత్‌లో అధిక ధరలకు ఆజ్యం పోయనున్నాయి. ఈ క్రమంలో ద్రవ్యోల్బణం మరింత ఎగిసిపడనుంది.
వడ్డీ రేట్లు పెరగొచ్చు..
హెచ్చు ద్రవ్యోల్బణ కట్టడికి ఆర్‌బిఐ వడ్డీ రేట్లను పెంచాల్సి రావొచ్చు. ఇప్పటికే హెచ్చు వడ్డీ రేట్లతో అన్ని రకాల రుణాలు ప్రియమయ్యాయి. రూపాయి దెబ్బతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున రాబోయే ఆర్‌బిఐ ఎంపిసి సమీక్షల్లో వడ్డీ రేట్లు పెంచడానికి మెండుగా అవకాశాలున్నాయి. అదే జరిగితే అన్ని రకాల రుణాలు మరింత భారం కానున్నాయి. ప్రస్తుత వాయిదా చెల్లింపుల (ఇఎంఐ) విలువ పెరగనుంది. దీంతో గృహ, వాహన అమ్మకాలపై ఒత్తిడి పెరగనుంది. అధిక ధరలు, హెచ్చు వడ్డీ రేట్లు ప్రజల కొనుగోలు శక్తిని హరించనున్నాయి. దీంతో వస్తు డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడనుంది.
ఐదేళ్లలో 100కు పడొచ్చు..
ప్రపంచ మార్కెట్‌లో రూపాయి విలువ మరింత పడిపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో 20 శాతం క్షీణించగా.. వచ్చే ఐదేళ్లలోనూ ఇదే స్థాయిలో పతనం కావొచ్చని పలు రిపోర్టులు చెబుతున్నాయి. 2030 నాటికి అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 100కు పడిపోవచ్చని దిక్వింట్ ఓ కథనంలో వెల్లడించింది. 2019లో డాలర్‌తో రూపాయి విలువ 70గా ఉంది. గడిచిన ఐదేళ్లలో మోడీ 2.0 హయంలో 20 శాతం పతనమై 85కు దిగజారింది. మోడీ 3.0 నేతృత్వంలోని 2029 డిసెంబర్ నాటికి 100కు దిగువకు పతనం కావొచ్చని అంచనా. 2025 డిసెంబర్ నాటికి 87ా88 మధ్య ఉండొచ్చని.. 2027 నాటికి రూ.95కు క్షీణించొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2029 నాటికి మూడో సారి మోడీ ప్రభుత్వ పదవీ కాలం పూర్తి కానుంది.
విదేశీ అప్పు చెల్లింపులు భారమే..
భారత్‌లోకి వచ్చి.. పోయే విదేశీ కరెన్సీ ఆధారంగా లెక్కించే కరెంట్ ఖాతా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీ లోటును ఎదుర్కోవచ్చని స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. డాలర్ విలువ పెరగడం.. రూపాయి అమాంతం బక్కచిక్కడంతో ప్రపంచ దేశాల నుంచి భారత్ తీసుకున్న అప్పులపై అధిక వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది. దిగుమతులు, అప్పులు, వడ్డీలకు చేసే విదేశీ చెల్లింపులతో భారత మారకం నిల్వలు వేగంగా కరిగిపోనున్నాయి. ఈ పరిణామాలకు తోడు హెచ్చు ద్రవ్యోల్బణం రూపాయిని, దేశాన్ని ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువను మరింత పటిష్టం చేస్తామని.. ఎట్టిపరిస్థితుల్లోనూ పడనివ్వబోమని 2013 ఎన్నికల ప్రచార సమయంలో నరేంద్ర మోడీ చేసిన ప్రచార అర్బాటానికి.. వాస్తవ పరిస్థితులు అత్యంత భిన్నంగా ఉన్నాయి. మోడీ అధికారంలోకి రాకముందు డాలర్‌తో రూపాయి విలువ 60 దిగువన ఉంది. రానున్న రోజుల్లోనూ రూపాయి విలువ పతనాన్ని మోడీ ఆపలేరోమోనని ఇటీవలి పలు పరిణామాలు రుజువు చేస్తున్నాయి.