రూపాయి పతనం ఆర్‌బిఐకి సవాల్‌

  • దిగుమతులపై త్వరలో సుంకాల పెంపు
  • ఇవై అంచనా

న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి మారకం రికార్డ్‌ స్థాయిలో పడిపోతున్న నేపథ్యంలో రూపీ విలువ కట్టడిపై కేంద్రం దృష్టి పెట్టనుందని టాక్స్‌ కన్సల్టెంట్‌ సంస్థ యర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ (ఇవై) అంచనా వేసింది. రూపాయి పతనాన్ని నిరోధించేందుకు ప్రభుత్వం రానున్న బడ్జెట్‌లో దిగుమతులపై అధిక సుంకాలను విధించే అవకాశాన్ని పరిశీలించవచ్చని ఇవై చీఫ్‌ పాలసీ అడ్వైజర్‌ డికె శ్రీవాస్తవ పేర్కొన్నారు. దిగుమతులపై అధిక పన్నులతో డాలర్ల డిమాండ్‌ను అరికట్టగలదని పేర్కొన్నారు. శ్రీవాస్తవ ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం సలహామండలి సభ్యుడిగా కూడా ఉన్నారు.

”అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ అకస్మాత్తుగా క్షీణించడంతో బడ్జెట్‌ రూపకర్తలకు, ద్రవ్య విధానపరంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బిఐ)కి సవాలుగా మారుతుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందనే అంచనాలతో ప్రపంచంలోని ఆర్థిక వనరులు అక్కడికి తరలిపోతున్నాయి. రూపాయి సహా ఇతర యూరోపియన్‌ కరెన్సీలు కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో రూపాయి పతన కట్టడికి రానున్న బడ్జెట్‌లో సుంకం రేట్లను పరిశీలించే అవకాశం ఉంది. దిగుమతులపై సుంకాలు విధించడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు మద్ధతును లభించనుంది. ఫలితంగా దిగుమతి సుంకం ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతుంది. దీంతో డాలర్‌కు డిమాండ్‌ తగ్గనుంది.” అని శ్రీవాస్తవ పేర్కొన్నారు. జనవరి 13న అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ ఒక్క రోజులోనే 66 పాయింట్లు పతనమై చరిత్రలోనే తొలిసారిగా 86.70 కనిష్ఠ స్థాయికి దిగజారింది. గత రెండు వారాల్లో దీని విలువ ఒక్క రూపాయి కంటే ఎక్కువగా పడిపోయింది. ఈ క్రమంలో భారత కరెన్సీ పతనాన్ని అదుపు చేయడానికి సుంకాల పెంపు మద్దతును ఇవ్వనుందని శ్రీవాస్తవ పేర్కొన్నారు.

➡️