- సెన్సెక్స్ 1131 పాయింట్ల పెరుగుదల
ముంబయి : చాలా రోజులుగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న దలాల్ స్ట్రీట్ ఎట్టకేలకు మురిపించింది. పలు సానుకూల సంకేతాలతో మంగళవారం భారత మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేశాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్ 1131 పాయింట్లు లేదా 1.53 శాతం పెరిగి 75,301కి చేరింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 326 పాయింట్లు లేదా 1.45 శాతం లాభపడి 22,834 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇంట్రాడేలో 1200 పాయింట్ల మేర ర్యాలీ చేసి 75,385 గరిష్టాన్ని తాకింది. బిఎస్‌ఇలో లిస్టెడ్ కంపెనీల విలువ రూ.6.85 లక్షల కోట్లు పెరిగి రూ.400.03 లక్షల కోట్లకు చేరింది. డాలరుతో రూపాయి మారకం విలువ 27 పైసలు పెరిగి 86.54గా నమోదయ్యింది. సెన్సెక్స్ 30 సూచీలో జొమాటో, ఐసిఐసిఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, ఎల్‌అండ్‌టి షేర్లు అధికంగా లాభపడిన వాటిలో టాప్‌లో ఉన్నాయి. మరోవైపు బజాజ్ ఫిన్‌సర్వ్, భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండిస్టీస్ అధిక నష్టాలు చవి చూశాయి.
అమెరికా, ఆసియా మార్కెట్లలో లాభాలు చోటు చేసుకోవడం భారత మార్కెట్లలోనూ విశ్వాసాన్ని నింపాయి. చైనా ఆర్ధికాభివృద్ధి చర్యల కారణంగా హాంకాంగ్ హాంగ్‌సెంగ్ ఏకంగా 2 శాతం మేర పెరిగి మూడేళ్ల గరిష్ఠానికి ఎగిసింది. అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య యుద్ధాల నేపథ్యంలో చైనా దేశీయంగా వినియోగాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టింది. దీంతో ఆ దేశ మార్కెట్లు పరుగులు పెట్టాయి. వాణిజ్య యుద్ధ భయాలతో ఇటీవల భారీగా పడిపోయిన షేర్ల విలువలు కొనుగోళ్లకు ఆకర్షణీయంగా ఉండటంతో మార్కెట్లకు మద్దతు లభించిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఎన్‌ఎస్‌ఇలో అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి. రియాల్టీ, మీడియా రంగాలు 3 శాతం చొప్పున పెరిగాయి. ఆటో, పిఎస్‌యు బ్యాంక్, లోహ, కన్సూమర్ డ్యూరెబుల్స్ రంగాలు 2 శాతం చొప్పున లాభపడ్డాయి.