తాకట్టు చెరలో స్వర్ణం

Dec 1,2024 01:51 #Business, #Gold
  • ఏడు నెలల్లో బంగారం రుణాలు 50% పెరుగుదల
  • ఆదాయాల్లో తగ్గుదల ఫలితం!

ప్రజాశక్తి – బిజినెస్‌ డెస్క్‌ : ఎన్నో ఆశలు, సంతోషాలతో కొనుక్కునే స్వర్ణం తాకట్టు పడుతోంది. దేశంలో తగ్గిన ఆదాయాలు, భారీగా పెరిగిన ఖర్చులు పసిడి తనఖాకు దారితీస్తున్నాయి. ఏడాది కాలంలో అమాంతం పెరుగుతోన్న వ్యయాలను తట్టుకోవడానికి ప్రజలు ఉన్న బంగారాన్ని భారీగా కుదువ పెట్టేశారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) గణాంకాల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ కాలంలో పసిడి అప్పులు ఏకంగా 50.4 శాతం ఎగిసి రూ.1,54,282 కోట్లకు చేరాయి. 2024 మార్చి ముగింపు నాటికి ఈ రుణాల విలువ రూ.1,02,562 కోట్లుగా ఉంది. విద్య, వైద్యం, వ్యక్తిగత, వ్యవసాయ అవసరాలు తీర్చుకోవడానికి ప్రజలు బంగారం రుణాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీంతో బ్యాంకింగేతర విత్త సంస్థలు (ఎన్‌బిఎఫ్‌సి)లు అన్‌ సెక్యూర్డ్‌ రుణాల కంటే సెక్యూర్డ్‌ రుణాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. పసిడి రుణాలకు డిమాండ్‌ పెరగడానికి ప్రజలు ఆర్థికంగా దెబ్బతినడమే ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పెరిగిన క్రెడిట్‌ కార్డు రుణాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో వ్యక్తిగత రుణాలు 5.6 శాతం పెరిగాయి. గృహ రుణాలు 12.1 శాతం పెరిగి రూ.28.7 లక్షల కోట్లకు చేరాయి. క్రెడిట్‌ కార్డులపై రుణాలు 9.2 శాతం పెరిగి రూ.2.81 లక్షల కోట్లకు చేరాయి. అన్‌సెక్యూర్డ్‌ రుణాలు 3.3 శాతం తగ్గాయి. తొలి ఏడు నెలల్లో బ్యాంక్‌ రుణాల జారీ 4.9 శాతం పెరిగి రూ.172.4 లక్షల కోట్లుగా నమోదైంది.

ఇఎంఐలకు ఆర్‌బిఐ ఆదేశం

రుణగ్రహీతలను కుదువ సంస్థలు మోసానికి గురిచేస్తుండటం, పసిడి విలువ నిర్ధారణలో లోపాలు, వేలంలో పారదర్శకత లేకపోవడం వంటి అంశాలు ఆర్‌బిఐ దృష్టికి వెళ్లాయి. కొందరు వడ్డీ చెల్లించి బంగారం రుణాలను దీర్ఘకాలం కొనసాగిస్తున్నట్లు గుర్తించింది. ఇప్పటి వరకు ఇఎంఐ (నెల వారీ వాయిదాలు) చెల్లించే పద్దతి లేక అనేక మంది ఏకకాలంలో అప్పులు చెల్లించలేక పసిడిని వదిలేసుకుంటున్న ఘటనలు చోటుచేసుకుంటు న్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఆర్‌బిఐ రుణగ్రహీతలకు ఇఎంఐలకు అవకాశం ఇచ్చేలా ఓ విధానాన్ని రూపొందించుకోవాలని విత్త సంస్థలను ఆదేశించింది.

➡️