డాక్టర్‌ రెడ్డీస్‌లో భారీగా ఉద్వాసనలు..!

హైదరాబాద్‌ : దిగ్గజ ఔషధ ఉత్పత్తుల కంపెనీ డాక్టర్‌ రెడ్డీస్‌ లాబరేటరీస్‌ తన 25 శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపించనుందని తెలుస్తోంది. వ్యయాలను తగ్గించుకునే చర్యల్లో భాగంగా సిబ్బందిపై వేటు వేయనుందని ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. ముఖ్యంగా సంస్థలోని రీసర్చ్‌ అండ్‌ డెవలప్మెంట్‌ విభాగాల్లో పనిచేస్తున్న 50 నుంచి 55 సంవత్సరాల వయసున్న ఉద్యోగులకు కంపెనీ స్వచ్ఛంద పదవీ విరమణ ఆఫర్‌ చేసింది. అదే విధంగా వివిధ విభాగాల్లో ఏడాదికి రూ.1 కోటి జీతం పొందుతున్న అనేకమంది ఉద్యోగులను రాజీనామా చేయాలని సంస్థ ఇప్పటికే కోరినట్లు సమాచారం. 2024 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఆదాయం రూ.8,359 కోట్లకు చేరగా.. రూ.1,413 కోట్ల లాభాలు నమోదు చేసింది. కాగా.. 25 శాతం ఉద్యోగులను తొలగించనున్నామనే రిపోర్టుల్లో వాస్తవం లేదని డాక్టర్‌ రెడ్డీస్‌ రెగ్యూలేటరీ సంస్థలకు సమాచారం ఇచ్చింది.

➡️