- సిఎస్‌ఐఆర్ డైరెక్టర్ జనరల్ కలయిసెల్వి వెల్లడి
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది మేడ్ ఇన్ ఇండియా పారాసెటమాల్ అందుబాటులోకి రానుందని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండిస్టీయల్ రీసెర్చ్ (సిఎస్‌ఐఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్ కలైసెల్వి తెలిపారు. దీంతో చైనా లాంటి పారిశ్రామిక ఆవిష్కరణలపై ఆధారపడటం తగ్గనుందన్నారు. సిఎస్‌ఐఆర్ తొలి మహిళ డైరెక్టర్ జనరల్ అయినా కలైసెల్వి ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. భారతదేశ పారిశ్రామిక ఆవిష్కరణలను పెంచడానికి తమ పరిశోధనా సంస్థ చేస్తున్న ప్రయత్నాల గురించి వెల్లడించారు. గడిచిన మూడు, నాలుగేళ్లలో ఎన్నో ఆవిష్కరణలు చేశామన్నారు. తాము స్వదేశీ హైడ్రోజన్ సిలిండర్ టైప్-4 పారాసెటమాల్‌ను అభివృద్ధి చేశామన్నారు. ఇతర ఆవిష్కరణలలో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ, హన్సా-3 టూ-సీటర్ లైట్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ వంటి ఏరోస్పేస్ టెక్నాలజీ, సివిడి ఫార్మింగ్ టెక్నాలజీ, రోడ్డు నిర్మాణంలో స్టీల్ స్లడ్జ్ నిర్వహణ తదితర వినూత్న కల్పనలు చేపట్టామన్నారు.
”భారత్ ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి పారాసిటమాల్ పదార్థాలను దిగుమతి చేసుకుంటుంది. వచ్చే ఏడాది నాటికి భారతదేశం తన స్వంత పారాసెటమాల్‌ను తయారు చేయనుంది. సిఎస్‌ఐఆర్ ప్రభావవంతమైన, చౌకైనా కొత్త సాంకేతికతతో దీన్ని ఆవిష్కరిస్తుంది. భారత్‌ను ఔషధ రంగంలో మరింత స్వావలంబనగా మార్చడానికి సిఎస్‌ఐఆర్ టెక్నాలజీతో కర్నాటకకు చెందిన సత్య దీప్త ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ దేశీయ నూతన పారాసెటమాల్, ఇతర టాబ్లెట్లను తయారు చేయనుంది.” అని కలైసెల్వి తెలిపారు.
పరిశ్రమల తలుపు తట్టడం నుండి పరిశ్రమలే తమ అవసరాలు, ఆవిష్కరణల కోసం సిఎస్‌ఐఆర్‌ను ఆశ్రయించేలా తమ విధానం మారిందన్నారు. ప్రపంచ సరఫరా చెయిన్‌లో తమ ఉత్పత్తి వ్యవస్థలను మార్చడానికి ఎనిమిది భిన్న ప్రాంతాలను గుర్తించామన్నారు. పరిశ్రమల అవసరాలు, ఉత్పత్తి నమూనాలు, సంస్కృతి, శైలి, యంత్రాంగాన్ని అర్థం చేసుకోవడానికి సిఎస్‌ఐఆర్ బృందాలు క్రమం తప్పకుండా పరిశ్రమలకు అందుబాటులో ఉంటూ సాయం చేస్తున్నాయన్నారు. ఆగ్రోకెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, ఆటోమోటివ్, మైనింగ్, లీజర్ ఇండిస్టీలలో రిడ్యూసింగ్ ఏజెంట్‌గా ఉపయోగించడానికి ఐరోపా దేశాల నుండి భారతదేశం ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న హైడ్రాజైన్ హైడ్రెట్ (హెచ్‌హెచ్) అనే రసాయనాన్ని తయారు చేయడానికి సిఎస్‌ఐఆర్ స్వదేశీ ప్రక్రియను అభివృద్థి చేసిందన్నారు. దీన్ని భారత్ స్వయంగా తయారు చేసుకోవడంతో ఆ దిగుమతులు 60 శాతం తగ్గాయన్నారు. రోడ్ల తయారీలో స్టీల్ స్లగ్‌లను నిర్వహించడం మరో కీలక ఆవిష్కరణ అని పేర్కొన్నారు.
2047 నాటికి భారతదేశాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధారిత గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చేందుకు దేశంలోని అన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థలు ఉదాహరణగా నిలుస్తాయని సిఎస్‌ఐఆర్ తన గౌహతి డిక్లరేషన్‌లో తెలిపింది. దేశీయ తయారీ రంగాన్ని మార్చేందుకు, విస్తరించేందుకు సంస్థలు తమ కార్యకలాపాలను మరింత మెరుగు పర్చుకోవడం ద్వారా ప్రపంచ సరఫరా చెయిన్‌లో భారత్ స్థానం మెరుగుపడనుందని పేర్కొంది.