- సెప్టెంబర్ త్రైమాసికంలో 5.4 శాతమే
- దాదాపు రెండేళ్ల కనిష్టానికి పతనం
- ఆర్‌బిఐ అంచనాలకు దూరం
- ఎన్‌ఎస్‌ఒ గణాంకాల వెల్లడి
న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థ ఉరుకులు పెడుతోందన్న బిజెపి పాలకుల ఊకదంపుడు ఉపన్యాసాలు, రిపోర్టులు వాస్తవ రూపంలో కార్యరూపం దాల్చడం లేదు. స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) వృద్ధి రోజురోజుకూ మందగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2)లో వృదిఆద ఏకంగా 5.4 శాతానికి పడిపోయి.. దాదాపు రెండేళ్ల కనిష్టానికి క్షీణించింది. ఆర్‌బిఐ, రేటింగ్ ఏజెన్సీల అంచనాల కంటే ఘోరంగా క్షీణించడం గమనార్హం. కేంద్ర గణాంకాల శాఖ (ఎన్‌ఎస్‌ఒ) శుక్రవారం జిడిపి రిపోర్ట్‌ను వెల్లడించింది. మైనింగ్, గనుల రంగాలు అత్యంత పేలవ ప్రదర్శన కనబర్చాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో జిడిపి ఏకంగా 8.1 శాతం పెరుగుదల చోటుచేసుకుంది. గడిచిన ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 6.7 శాతానికి పరిమితమైంది. ఈ రెండింటితోనూ పోల్చినా జిడిపిలో భారీ తగ్గుదల నమోదుకావడం ఆందోళనకరం. మరోవైపు రేటింగ్ ఏజెన్సీలు కూడా 6 శాతం ఎగువన వృద్ధి ఉండొచ్చని చేసిన అంచనాల కంటే మరింతగా పడిపోవడం విశేషం. జిడిపి 7 శాతం పెరగనుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ శక్తికాంతదాస్ అంచనా వేశారు. ఆర్‌బిఐ అంచనాలకు మించి జిడిపి పతనం కావడం ఆర్థిక వ్యవస్థ పట్ల తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒక ఏడాదిలో దేశంలో ఉత్పత్తి అయిన సరుకులు, సేవల మొత్తం విలువను జిడిపిగా పేర్కొంటారు. ఇది ఆర్థిక వ్యవస్థ పనితీరును తెలుపుతోంది. జిడిపి పడిపోతుందంటే దేశంలో ఆర్థిక కార్యకలాపాలు సన్న గిల్లుతున్నాయని అర్థం. ఇటీవల ప్రజల వినిమయం భారీగా దెబ్బతిందన్న రిపోర్టులు జిడిపిపై తీవ్ర ప్రభావం చూపి ఉంటుందని తెలుస్తోంది.