భారత జిడిపి 6.6 శాతానికి మందగింపు

Jan 10,2025 23:56 #6.6 percent, #Business, #India's GDP, #slows
  • ఐక్యరాజ్య సమితి అంచనా
  • గ్లోబల్‌ వృద్ధిలోనూ స్తబ్దత

న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది 2025లో భారత జిడిపి 6.6 శాతానికి మందగించే అవకాశాలున్నాయని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. 2024లో 6.9 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. వచ్చే 2026లోనూ 6.7 శాతానికే పరిమితం కావొచ్చని తన ‘ప్రపంచ ఆర్ధిక పరిస్థితి మరియు అంచనా రిపోర్ట్‌’లో విశ్లేషించింది. అదే జరిగితే వరుసగా మూడేళ్లలో ఏడు శాతం లోపే వృద్ధి చోటు చేసుకోనుంది. కరోనా తర్వాత 2023లో 8 శాతం వృద్ధి నమోదయ్యింది. ‘కోవిడ్‌ సంక్షోభం తర్వాత తగ్గిన డిమాండ్‌ కారణంగా గత మూడు సంవత్సరాలలో భారత్‌ అధిక జిడిపి వృద్ధిని నమోదు చేసిందని ఐక్యరాజ్యసమితి ఆసియా, పసిఫిక్‌ ఆర్థిక, సామాజిక కమిషన్‌ (యుఎన్‌ఇఎస్‌సిఎపి) మాజీ డైరెక్టర్‌ నగేష్‌ కుమార్‌ అన్నారు. తాజాగా తిరిగి కోవిడ్‌ పూర్వ ధోరణికి తిరిగి వచ్చామన్నారు. ఇటీవల కేంద్ర గణంకాల శాఖ అధికారికంగా వెల్లడించిన రిపోర్ట్‌ ప్రకారం.. జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో భారత జిడిపి 5.4 శాతానికి క్షీణించింది. ఇది దాదాపు రెండేళ్ల కనిష్ట స్థాయి. తయారీ కార్యకలాపాలు పేలవంగా ఉండటం వల్ల జిడిపి భారీగా తగ్గింది. ఈ స్థాయి వృద్ధి తగ్గుదలను అంచనా వేయలేదని ఆర్‌బిఐ ఎంపిసి సభ్యుడు అయినా నగేష్‌ కుమార్‌ అశ్చర్యం వ్యక్తం చేశారు. ఆర్థిక వృద్ధి మందగించడానికి ప్రయివేటు పెట్టుబడి నెమ్మదించడమే ప్రధాన కారణమన్నారు. అధిక వడ్డీ రేట్లు కూడా ఓ కారణం కావొచ్చన్నారు. ద్వితీయార్థంలో జిడిపి పుంజుకునే అవకాశాలున్నాయన్నారు.

పొంచి ఉన్న ప్రమాదాలు

ప్రపంచ వృద్ది రేటులోనూ స్తబ్దత చోటు చేసుకోవచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ప్రస్తుత ఏడాది 2025లో ప్రపంచ వృద్ధి రేటు 2.8 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. 2024లోనూ ఇదే స్థాయిలో చోటు చేసుకుందని ముందస్తు అంచనా వేసింది. ఇప్పటికీ అనిశ్చితి పెద్ద ఎత్తున ఉందని తెలిపింది. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో భౌగోళిక రాజకీయ సంఘర్షణలు, పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, పెరిగిన రుణ వ్యయాల నుండి వచ్చే ప్రమాదాలు పొంచి ఉన్నాయని విశ్లేషించింది. ఈ సవాళ్లు ముఖ్యంగా తక్కువ ఆదాయం, దుర్బల దేశాలపై తీవ్ర ప్రతికూలతను చూపనున్నాయని విశ్లేషించింది. ఈ పరిణామాలు ప్రపంచ అభివృద్ధి పురోగతిని దెబ్బతీయనున్నాయని హెచ్చరించింది.

➡️