ఇండుస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు క్రాష్‌

Mar 11,2025 21:55 #Business, #IndusInd Bank, #shares crash

ముంబయి : ప్రయివేటు రంగంలోని ఇండుస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు కుప్పకూలాయి. ఆ బ్యాంక్‌కు చెందిన డెరివేటివ్‌ పోర్ట్‌ఫోలియోలో అవకతవకలు చోటు చేసుకోవడంతో మంగళవారం మదుపర్లు అమ్మకాలకు దిగారు. దీంతో బిఎస్‌ఇలో ఇండుస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్‌ 27.17 శాతం లేదా రూ.244.65 పతనమై రూ.655.95కి జారుకుంది. ఇది 52 వారాల కనిష్ట స్థాయి. రెగ్యులేటరీ ఫైలింగ్‌లో డెరివేటివ్‌ పోర్ట్‌ఫోలియోకు సంబంధించిన ప్రక్రియల అంతర్గత సమీక్ష సందర్భంగా ఖాతాల బ్యాలెన్స్‌లో కొన్ని వ్యత్యాసాలను గుర్తించినట్లు సోమవారం ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ పేర్కొంది. దాంతో బ్యాంక్‌ నికర విలువపై దాదాపు 2.35 శాతం ప్రతికూల ప్రభావం పడనున్నట్లు అంచనా వేసింది. ఇది రూ.1,530 కోట్ల నష్టానికి సమానం. సెప్టెంబర్‌ 2023లో ఆర్‌బిఐ జారీ చేసిన సూచనల మేరకు ఈ సమీక్ష జరిగింది. ఈ విషయాన్ని ఆడిటర్‌ పరిశలిస్తుందని, మార్చి 2025 నాటికి నివేదిక వస్తుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. అయితే, ప్రతికూల ప్రభావాన్ని తట్టుకోగలమని బ్యాంక్‌ స్పష్టం చేసింది. ఇండుస్‌ఇండ్‌ బ్యాంక్‌ ప్రకటన షేర్లపై తీవ్ర ఒత్తిడిని పెంచింది. ఫలితంగా ఒక్క పూటలోనే ఆ బ్యాంక్‌ మార్కెట్‌ కాపిటలైజేషన్‌ రూ.70,161.6 కోట్ల నుంచి రూ.51,102 కోట్లకు పడిపోవడంతో రూ.19,059 కోట్ల విలువ చేసే మదుపర్ల సంపద హరించుకుపోయింది. ఒక్క పూటలో ఈ స్థాయిలో ఇండుస్‌ఇండ్‌ బ్యాంక్‌ నష్టపోవడం ఇది వరకు ఎప్పుడూ జరగలేదు.

➡️