పారిశ్రామికోత్పత్తి భారీ పతనం

  • ఫిబ్రవరిలో 2.9 శాతానికి పరిమితం
    ఏడు నెలల కనిష్టానికి చేరిక
    పేలవంగా తయారీ, మైనింగ్‌ రంగాలు

న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ప్రజల ఆదాయాలు సన్నగిల్లడంతో సరుకుల డిమాండ్‌ తగ్గుతోంది. ఫలితంగా పారిశ్రామిక ఉత్పత్తి సైతం నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ముఖ్యంగా తయారీ, విద్యుత్‌, మైనింగ్‌ రంగాలు పడకేయడంతో పారిశ్రామికోత్పత్తిలో భారీ పతనం చోటుచేసుకుంది. కేంద్ర గణాంకాల శాఖ (ఎన్‌ఎస్‌ఓ) అధికారికంగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రస్తుత ఏడాది ఫిబ్రవరిలో దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) వృద్ధి 2.9 శాతానికి పరిమితమైంది. ఇది ఏడు నెలల కనిష్ట స్థాయి కావడంతో తీవ్ర ఆందోళనకరంగా మారింది. గతేడాది ఇదే నెలలో ఐఐపి వృద్ధి 5.6 శాతంగా ఉండటం గమనార్హం. ఏడాది కాలంలో ఈ స్థాయిలో పతనం కావడం, అంతర్జాతీయ పరిణామామాల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ సుస్థిరతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారిశ్రామికోత్పత్తి ఈ స్థాయిలో పతనం కావడానికి తయారీ, మైనింగ్‌, విద్యుత్‌ రంగాల పనితీరు అత్యంత పేలవంగా ఉండటమే ప్రధాన కారణమని ఎన్‌ఎస్‌ఒ గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.

సాధారణ వస్తువులకు సైతం….
దేశ వ్యాప్తంగా సాధారణ వస్తువుల కొనుగోలుకు ప్రజానీకం తటపటాయించే పరిస్థితి ఏర్పడింది. గత ఏడాదితో పోలిస్తే ఎన్‌ఎస్‌ఒ నివేదిక ప్రకారం 2025 ఫిబ్రవరిలో కాస్మోటిక్స్‌, ఆహారం, పానియాలు, ఇంధనం, వస్త్రాలు, పాదరక్షలు తదితర కన్స్యూమర్‌ నాన్‌ డ్యూరెబుల్‌ సరుకుల ఉత్పత్తి 2.1 శాతానికి పడిపోవడం దీనికి నిదర్శనం. రోజువారీ వినియోగంలో అత్యంత సాధారణమైన వీటి వినియోగానికి కూడా ప్రజలు తటపటాయించే పరిస్తితి రావడం ఆర్థిక తిరోగమనానికి నిదర్శనంగాచెబుతున్నారు. మొత్తం మీద తయారీ రంగంలో వృద్ధి 2.9 శాతానికి మందగించింది. గతేడాది ఇదే నెలలో 4.9 శాతం పెరుగుదల నమోదయ్యింది. ఇదే నెలలో గనుల రంగం ఉత్పత్తి 8.1 శాతంగా చోటు చేసుకోగా, ఫిబ్రవరిలో ఏకంగా 1.6 శాతానికి క్షీణించింది. 2024 ఫిబ్రవరిలో 7.6శాతం వృధ్థిని కనపరిచిన విద్యుత్‌ రంగం తాజాగా 3.6 శాతానికి తగ్గిపోయింది. గత ఏడాది ఇదే నెలలో మౌలిక వసతులు, నిర్మాణ రంగం ఉత్పత్తుల వృద్ధి 8.3 శాతంగా ఉండగా.. 2025 ఫిబ్రవరిలో 6.6 శాతానికి పడిపోయింది. ముడి చమురు, బొగ్గు, ఇనుము, వ్యవసాయ ఉత్పత్తులు తదితర వాటికి సంబంధించిన ప్రాథమిక వస్తువుల ఉత్పత్తి వృద్ధి 2.8 శాతానికి పడిపోయింది. ఇది అంతకుముందు ఏడాది ఫిబ్రవరిలో 5.9 శాతంగా నమోదయ్యింది. ఇదే సమయంలో కలప, స్టీల్‌, గ్లాస్‌, విలువైన లోహాలతో చేసిన తుది వస్తువులకు సంబంధించిన ఇంటర్మీడియట్‌ గూడ్స్‌ ఉత్పత్తి వృద్ధి 1.5 శాతానికి పడిపోయింది. ఈ విభాగం 2024 ఇదే నెలలో 8.6 శాతం పెరుగుదలను సాధించింది. స్థూలంగా గడిచిన ఆర్థిక సంవత్సరం (2024-25) ఏప్రిల్‌ నుంచి ఫిబ్రవరి కాలంలో ఐఐపి వృద్ధి 4.1 శాతానికి పడిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతికి గీటురాయిగా భావించే పారిశ్రామికోత్పత్తి సూచీ పడిపోవడం.. మరోవైపు అమెరికా వాణిజ్య యుద్ధం ప్రతికూల పరిణామాలు ఉపాధి, ఆదాయాలను దెబ్బతీయనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అంచనాలకు భిన్నంగా….
నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర బిజెపి ప్రభుత్వ అట్టహాస ప్రకటనల నేపథ్యంలో వివిధ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు గతంలో భారీ అంచనాలను వ్యక్తం చేశాయి. రాయిటర్‌పోల్స్‌లో పాల్గొన్న ఆర్థిక వేత్తలు నాలుగుశాతం వృద్ధిని అంచనా వేశారు. బ్లూమ్‌బెర్గ్‌ కూడా 3.6శాతం వృద్ధిని అంచనా వేసింది. వీరి అంచనాలకు తగ్గట్టుగానే 2025 జనవరిలో 5.01 శాతం వద్ద ధృడంగా ప్రారంభమైన వృద్ధి గణాంకాలు రెండు నెలల కాలంలోనే భారీగా పతనంకావడం విశేషం

➡️