వినిమయం పడిపోతోంది
వృద్ధి మందగిస్తోంది
ఆర్థిక వ్యవస్థపై రఘురాం రాజన్ విమర్శలు
న్యూఢిల్లీ : భారత ఆర్ధిక వ్యవస్థ మందగించడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. వినిమయ డిమాండ్‌లో పతనం చోటు చేసుకుంటుందన్నారు. బడ్జెట్ కు ముందు రాజన్ మధ్యతరగతి ప్రజల గురించి ఆందోళన వ్యక్తం చేయడం విశేషం. ”దేశంలో డిమాండ్ వినియోగం బలంగా లేదు. మధ్యతరగతిలో ఎగువ శ్రేణీ తప్పా.. ఉద్యోగాల కొరత కారణంగా దిగువ మధ్యతరగతి ప్రజలు బాధపడుతున్నారు. సమస్య ఇప్పటికీ అలాగే ఉంది.” అని రాజన్ ఓ ఇంటర్యూలో పేర్కొన్నారు. 2024-25లో భారత జిడిపి 6.4శాతానికి పరిమితమై.. నాలుగు నెలల కనిష్టానికి పడిపోనుందని ఇటీవల కేంద్ర గణంకాల శాఖ (ఎన్‌ఎస్‌ఒ) అంచనా వేసింది. గడిచిన జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రయివేటు వినిమయ డిమాండ్ 6 శాతం తగ్గిందని అంచనా. ఇంతక్రితం త్రైమాసికంలో 7.4 శాతంగా ఉంది.
‘మనం ఒక విధమైన సర్దుబాట్లకు వచ్చాము స్థిరమైన వృద్ధి స్థాయి వైపు కదులుతున్నాము. ఇది 6 శాతం పరిధిలో ఉంది. ఇది కొత్త విషయం కానప్పటికీ ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే 6 శాతం మనకు సరిపోదు. మనకు మరింత మెరుగైన వృద్ధి అవసరం. జనాభా డివిడెండ్‌కు అనుగుణంగా ఫలితాన్ని పొందాలి” అని రాజన్ పేర్కొన్నారు.
గడిచిన ఐదు త్రైమాసికాలుగా పట్టణ డిమాండ్ తగ్గుతోంది. మధ్యతరగతి, తక్కువ ఆదాయ కుటుంబాలు నిత్యావసరాలపై కూడా తక్కువ ఖర్చు చేస్తున్నాయి. అధిక ఆహార ద్రవ్యోల్బణం సబ్బులు, షాంపూల నుండి కార్లు, ద్విచక్ర వాహనాల వరకు, ముఖ్యంగా నగరాల్లో వస్తువుల డిమాండ్‌ను దెబ్బతీస్తోంది. రాబోయే బడ్జెట్‌లో పన్ను తగ్గింపు సామాన్యుల జేబుల్లో ఎక్కువ డబ్బును ఉంచుతుంది, ఇది ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో వినిమయం పెంచడానికి దోహదం చేయనుంది.