న్యూఢిల్లీ : కృత్రిమ మేధా (ఎఐ) ప్రభావంతో వచ్చే ఐదేళ్లలో బ్యాంకింగ్ రంగంలో లక్షలాది ఉద్యోగాలు ఊడనున్నాయని రిపోర్టులు వస్తోన్నాయి. ప్రస్తుతం మానవ ఉద్యోగులు నిర్వహిస్తున్న పనులను ఎఐ ఆక్రమించడంతో అంతర్జాతీయ బ్యాంకులు రాబోయే మూడు నుండి ఐదు సంవత్సరాలలో దాదాపు 2 లక్షల ఉద్యోగాలను తొలగించనున్నాయని అంచనా. ఆయా బ్యాంకుల చీఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అధికారులను బ్లూమ్‌బర్గ్ సర్వే చేసి ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. ఒక్కో బ్యాంకు సగటున తమ వర్క్‌ఫోర్స్‌లో నికరంగా 3 శాతం మందిని తగ్గిస్తుందని అంచనా. ఇక కెవైసి విధులను నిర్వర్తించే పాత్రలకు ముప్పు తప్పదని పేర్కొంది. మానవ వనరుల సంఖ్యలో 5 శాతం నుంచి 10 శాతం వరకు తగ్గొచ్చని మొత్తం 93 మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ సర్వేలో దాదాపు నాలుగింట ఒక వంతు మంది అభిప్రాయపడ్డారు.