- ఎన్‌బిఎఫ్‌సిల్లో లోపాలు
- సిఎఫ్‌ఒలు సీరియస్‌గా తీసుకోవాలి
- ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ ఆందోళన
న్యూఢిల్లీ : బ్యాంక్‌లు, బ్యాంకింగేతర విత్త సంస్థల్లో ఇటీవల లక్షలాది మోసపూరిత ఖాతాలు పెరిగిపోతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ జె అన్నారు. మోసపూరిత లావాదేవీలు, ఎవర్‌గ్రీనింగ్ రుణాల కోసం ఉపయోగించే బ్యాంకు ఖాతాలు ఇటీవల పెరిగాయన్నారు. కొన్ని బ్యాంకులు ఇలాంటి లక్షలాది ఖాతాలను కలిగి ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. రుణగ్రహీత చెల్లించిన ప్రిన్సిపల్ మొత్తంను మళ్లీమళ్లీ రుణ రూపంలో ఖాతాదారులకు ఇవ్వడాన్ని ఎవర్‌గ్రీనింగ్ రుణాలుగా భావిస్తారు. మంగళవారం బ్యాంకుల చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్లు, ఆడిటర్లతో జరిగిన సమావేశంలో స్వామినాథన్ మాట్లాడుతూ.. అంతర్గత ఖాతాల నియంత్రణ, నిర్వహణలో లోపాలు ఉన్నాయని విత్త సంస్థలను ఉద్దేశించి అన్నారు. కొన్ని బ్యాంకులకు సరైన కారణం లేకుండా లక్షలాది ఖాతాలు కలిగి ఉండటాన్ని తాము గుర్తించామన్నారు. గత వారం బ్యాంక్ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలోనూ మోసపూరిత ఖాతాలపై ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ మోసాలను అరికట్టాలని సూచించారు. ఈ ఖాతాల్లో కొన్ని మోసపూరిత లావాదేవీలు, రుణాల ఎవర్ గ్రీన్ కోసం వినియోగిస్తున్నట్లు స్వామినాథన్ తెలిపారు. ఈ ఖాతాలతో దుర్వినియోగానికి అవకాశం ఉన్నందున వాటిని హేతుబద్ధీకరించాలని సూచించారు. వీలైనంత వరకు తగ్గించాలన్నారు. సంస్థల ఆర్థిక సమగ్రతను, పారదర్శకతను కాపాడుకోవడంలో సిఎఫ్‌ఒలు కీలక పాత్రను పోశించాలన్నారు. పలు బ్యాంకుల్లో సరైన కారణం లేకుండా కొనసాగిస్తున్న లక్షలాది ఖాతాలు కొన్ని మోసపూరిత లావాదేవీలకు మద్దతును ఇస్తున్నాయన్నారు. విత్త సంస్థల్లో పారదర్శకత పెంచడానికి ఆడిటర్లు, సిఎఫ్‌ఒలు నిజాయితీతో వ్యవహారించాలని మరో డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు సూచించారు. ఎన్‌బిఎఫ్‌సిలలో మార్గదర్శకాల అమలు లోపించిందన్నారు.