- 95 శాతం ట్రేడ్ సర్టిఫికెట్లు లేనివే..!
- ఆర్‌టిఎ అధికారుల చర్యలు
బెంగళూరు : ప్రముఖ ద్విచక్ర విద్యుత్ వాహనాల కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ ట్రేడ్ అనుమతులు లేకుండానే షోరూంలను నిర్వహిస్తోంది. 95 శాతం షోరూంలను అనుమతులు లేకుండానే నిర్వహిస్తోందని బ్లూమ్‌బర్గ్ ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. ఆ వివరాలు.. దేశ వ్యాప్తంగా ఓలా ఎలక్ట్రిక్‌కు మొత్తంగా 4,000 రిటైల్ అవుట్‌లెట్‌లు ఉన్నాయి.. అందులో 3,400 షోరూంలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంది. వాటిలో కేవలం 100 షోరూంలకు మాత్రమే భారత మోటారు వాహనాల చట్టం ప్రకారం ట్రేడ్ సర్టిఫికేట్లు ఉన్నాయి. దీంతో ఆ సంస్థ 95 శాతం సెంటర్లను నిబంధనలకు విరుద్దంగా నడిపిస్తోన్నట్లు స్పష్టం అవుతోంది. వీటిల్లో ద్విచక్ర వాహనాలను ప్రదర్శించడానికి, విక్రయించడానికి, టెస్ట్ రైడ్లను అందించడానికి లేదా రవాణా చేయడానికి అవసరమైన అనుమతులు లేవు.
2022లో తొలుత డిజిటల్ అమ్మకాలను మాత్రమే ప్రారంభించగా.. ఆ తర్వాత వినియోగదారులకు భౌతిక అనుభవాన్ని అందించడానికి, సర్వీసింగ్ సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో షోరూంలను ఏర్పాటు చేయడం ప్రారంభించింది. గతేడాది కొత్తగా దాదాపు 3200 స్టోర్లను ఏర్పాటు చేయడం ద్వారా మొత్తం నెట్‌వర్క్‌ను 4,000 సెంటర్లకు విస్తరించింది. ఇందులో ద్వితీయ, తృతీయ శ్రేణీ నగరాలు ఉన్నాయి. ఈ విస్తరణ లక్ష్యంలో ప్రాథమిక అనుమతులు అయినటువంటి ట్రేడ్ సర్టిఫికెట్‌ను తీసుకోకపోవడం గమనార్హం.
పలు షోరూంలు సీజ్..
అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన పలు షోరూంలను వివిధ రాష్ట్రాల్లోని రవాణా అధికారులు మూసివేస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ చేసింది. సంబంధిత రాష్ట్రాల్లోని కంపెనీ షోరూంల్లో దాడులు నిర్వహించి, వాటిని మూసివేసి, వాహనాలను సీజ్ చేసినట్లు సమాచారం. మరోవైపు రాష్ట్ర స్థాయి రవాణా అధికారుల నుంచి ఓలా ఎలక్ట్రిక్ షోకాజ్ నోటీసులను అందుకుంటుంది. కాగా.. ఈ వార్తలను ఓలా ఎలక్ట్రిక్ ఖండించింది. కంపెనీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, గోదాములు మోటారు వాహనాల చట్టం మార్గదర్శకాలకు అనుగుణంగానే ఉన్నాయని పేర్కొంది. అయితే ఆయా షోరూంలు ట్రేడ్ సర్టిఫికెట్లు కలిగి ఉన్నాయని మాత్రం స్పష్టం చేయకపోవడం గమనార్హం.
ఓలా ఎలక్ట్రిక్‌పై ముఖ్యంగా అమ్మకాల తర్వాత సర్వీసింగ్‌కు సంబంధించిన కార్యకలాపాలు, సేవలపై వాహనదారుల నుంచి ఇటీవల భారీగా ఫిర్యాదులు నమోదయ్యాయి. వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, తప్పుదోవ పట్టించే ప్రకటనలు, అన్యాయమైన వాణిజ్య పద్ధతులపై జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌కు 10,000 పైనే ఫిర్యాదులు రావడంతో సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సిసిపిఎ) విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విస్తరణ, కొత్త సర్వీసు సెంటర్లపై దృష్టి పెట్టింది. ఇదే క్రమంలో వ్యయాలు పెరగడంతో ఇటీవల 1,000 మంది సిబ్బందికి ఉద్వాసన పలుకనుందని రిపోర్టులు వచ్చాయి. ఇందులో శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. ప్రొక్యూర్‌మెంట్, కస్టమర్ రిలేషన్స్, ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా పలు విభాగాల్లో ఉద్వాసనలు ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది నవంబర్‌లోనూ 500 మందిని రోడ్డున పడేసింది. ఇటీవల ఆ సంస్థకు నష్టాలు పెరగడంతో ఈ చర్యలకు దిగుతోందని తెలుస్తోంది.