ఓలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఆదాయంలో 33% వృద్థి

Jan 30,2024 08:07 #Business, #olectra

హైదరాబాద్‌ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌తో ముగిసిన తృతీయ త్రైమాసికం (క్యూ3)లో ప్రముఖ విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ (ఒజిఎల్‌) ఆదాయం 33 శాతం పెరిగి రూ.342.4 కోట్లకు చేరింది. ఇదే సమయంలో కంపెనీ నికర లాభాలు 77 శాతం పెరిగి 27.11 కోట్లుగా నమోదయ్యాయి. బస్సుల సరఫరా సంఖ్య పెరగటంతో మెరుగైన వృద్థి రేటును సాధించినట్లు ఆ కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటి వరకు 1615 విద్యుత్‌ వాహనాలను డెలివరీ చేయగా 8088 బస్సుల ఆర్డర్‌ను కలిగి ఉన్నట్లు వెల్లడించింది. 2022-23లో తొమ్మిది మాసాల్లో 142 విద్యుత్‌ బస్సులను సరఫరా చేయగా.. 2023-24లో ఇప్పటి వరకు 178 బస్సులను అందించినట్లు తెలిపింది. సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో డైరెక్టర్ల బోర్డు అధికారికంగా ఫలితాలను ఆమోదించించినట్లు ఓలెక్ట్రా తెలిపింది. 2023 డిసెంబరు 31తో ముగిసిన తొమ్మిది నెలలకు కంపెనీ ప్రతి షేరుకు రూ.7.69 ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది గత ఏడాది ఇదే సమయానికి రూ.4.70గా ఉంది. 2023-24 తొలి మూడు త్రైమాసికాల్లో ఓలెక్ట్రా ఆదాయం 21 శాతం పెరిగి రూ.865.33 కోట్లుగా చోటు చేసుకుంది. అదే సమయంలో నికర లాభాలు 62 శాతం వృద్థితో రూ.63.76 కోట్లుగా నమోదయ్యాయి. ”ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మూడో త్రైమాసికాల్లోని ఆదాయంలో బలమైన వృద్థిని నివేదించడం మాకు సంతోషంగా ఉంది. మా బస్సుల ఉత్పత్తి సామర్థ్యాన్ని, సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించడంపై దృష్టి సారిస్తాము. 150 ఎకరాల విస్తీర్ణంలో సీతారాంపూర్‌ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు సాగుతున్నాయి.” అని ఒజిఎల్‌ ఛైర్మన్‌, ఎండి కెవి ప్రదీప్‌ తెలిపారు.

➡️