- భారత్‌లో హెచ్చు ధరలు కొనసాగింపు
- 70 డాలర్లకు తగ్గిన ముడి చమురు
- ప్రజలపై రూ.2 లక్షల కోట్ల భారం
- మరోవైపు ఎక్సైస్ సుంకం పెంపు..!
న్యూఢిల్లీ : అంతర్జాతీయ ముడి చమురు ధరల్లో భారీ తగ్గుదల చోటు చేసుకుంటున్నప్పటికీ.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం నింగిలోనే ఉన్నాయి. ప్రపంచ మార్కెట్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌లో బ్యారెల్ ముడి చమురు ధర 92 డాలర్లుగా ఉండగా.. తాజాగా 70 డాలర్ల దిగువకు పడిపోయింది. సెప్టెంబర్ 9న ఏకంగా 69 డాలర్లుగా పలికింది. ఆరు నెలల్లో దాదాపుగా 20 శాతం ధరలు దిగివచ్చాయి. 2021 డిసెంబర్ నాటి కనిష్ట స్థాయిలో చమురు ధరలు పలుకుతున్నాయి. అయినప్పటికీ బిజెపి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను హెచ్చు స్థాయిలోనే కొనసాగిస్తూ.. ప్రజల ఆదాయాలను సొమ్ము చేసుకుంటుంది. ముడి చమురుపై కేవలం 10 డాలర్లు తగ్గితే ఏడాదికి రూ.1.08 లక్షల కోట్లు ఆదా అవుతోంది. ఇటీవల దాదాపు 20 డాలర్లు పైనా తగ్గడంతో మోడీ సర్కార్ ఖజానాకు ఏడాదికి రూ.2 లక్షల కోట్లు పైనే సమకూరనుంది. అంటే ఆ మొత్తాన్ని ప్రజలపై అదనంగా భారం మోపినట్లు అవుతుంది.
పెట్రోల్, డీజిల్ ధరలపై దేశ వ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోన్న నేపథ్యంలో ఇటీవలి సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే ధరలను సవరించడం ఆపేసింది. పెంచిన ధరలను కొనసాగిస్తోంది. చివరి సారిగా 2022 ఏప్రిల్‌లో లీటర్ పెట్రోల్, డీజిల్ మీద నామమాత్రంగా రూ.2 ధర తగ్గించింది. ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100పైనా, డీజిల్ ధర రూ.90పైనే పలుకుతోంది. గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధర నిలకడగా కొనసాగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని ఇటీవల కేంద్ర చమురుశాఖ కార్యదర్శి పంకజ్ జైన్ అన్నారు. కానీ చమురు ధరలు దిగివచ్చినప్పటికీ కేంద్రం ఇప్పటికీ హెచ్చు ధరలను కొనసాగిస్తునే ఉంది. భారత్ తన చమురు అవసరాల్లో 88 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద ఇంధన వినియోగదారుల్లో భారత్ ఒకటిగా ఉంది. రష్యా ముడి చమురు ఇప్పటికీ తక్కువ ధరకే లభిస్తుందని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి గత వారం స్వయంగా ప్రకటించారు. దాంతో రష్యన్ కంపెనీల నుంచి మరింత చమురును కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్-రష్యాల మధ్య నెలకొన్న భౌగోళిక అనిశ్చితుల వల్ల యూరప్ దేశాలు రష్యా చమురు దిగుమతిపై ఆంక్షలు విధించాయి. దాంతో రష్యా చమురు ధరను భారీగా తగ్గించడంతో పాటు రూపాయిల్లోనూ వాణిజ్యం చేసుకునేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇది భారత్‌కు చాలా కలిసివచ్చింది. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముందు భారత్‌కు చమురు దిగుమతిలో రష్యా వాటా 1 శాతం కంటే తక్కువే ఉండేది. క్రమంగా అది పెరుగుతూ దాదాపు 40 శాతం వాటాకు చేరింది. పైగా రష్యా నుంచి చౌకగా చమురును దిగుమతి చేసుకుంటుంది. అయినప్పటికీ ఆ ప్రతిఫలాలను ప్రజలకు అందించక పోగా ఎక్సైస్ టాక్స్‌ను పెంచే యోచనలో ఉందని సంకేతాలు వస్తోన్నాయి. దేశంలోని అధిక చమురు ధరలు ప్రజల ఆదాయాలకు గండి కొడుతున్నాయి. మరోవైపు హెచ్చ ఇంధన ధరలు ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తున్నాయి. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎక్సైస్ టాక్స్‌ను మరింత పెంచి తన ఖజానాను భారీగా పెంచుకునే పనిలో పడటం గమనార్హం.