Ramdev baba: బీమా రంగంలోకి పతంజలి

Mar 13,2025 21:21 #Business, #insurance sector, #Patanjali

రామ్‌దేవ్‌ బాబా వ్యాపార సామాజ్య్రం విస్తరణ
న్యూఢిల్లీ : ప్రముఖ కార్పొరేట్‌, యోగా గురు రామ్‌దేవ్‌ బాబా తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించారు. తాజాగా మాగ్మా జనరల్‌ ఇన్సూరెన్స్‌లో పతంజలి అయుర్వేద్‌ మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. దీంతో రామ్‌దేవ్‌ బాబా బీమా వ్యాపారంలోకి ప్రవేశించినట్లయ్యింది. మగ్మా జనరల్‌ ఇన్సూరెన్స్‌ కొనుగోలు తర్వాత ఆ సంస్థలో పతంజలి ప్రధాన ప్రమోటర్‌గా మారనుంది. మాగ్మా జనరల్‌ ఇన్సూరెన్స్‌లో తమ వాటాను విక్రయించే ప్రధాన విక్రేతలలో సెనోటి ప్రాపర్టీస్‌, సెలికా డెవలపర్స్‌, జాగ్వార్‌ అడ్వైజరీ సర్వీసెస్‌, కేకి మిస్త్రీ, అతుల్‌ డిపి ఫ్యామిలీ ట్రస్ట్‌, షాహి స్టెర్లింగ్‌ ఎక్స్‌పోర్ట్స్‌, షాహి స్టెర్లింగ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ వంటి కంపెనీలు ఉన్నాయి. మాగ్మా జనరల్‌ ఇన్సూరెన్స్‌లో అదార్‌ పూనావాలాకు చెందిన సెనోటి ప్రాపర్టీస్‌ ఏకంగా 74.5 శాతం వాటాను కలిగి ఉంది. అది ఇప్పుడు పతంజలి గ్రూపునకు బదిలీ కానుంది. అయితే ఎంత మొత్తానికి కొనుగోలు ఒప్పందం జరిగిందనే విషయాన్ని ఆయా సంస్థలు వెల్లడించకపోవడం గమనార్హం. నూతన యాజమాన్యం పతంజలి అయుర్వేద్‌, డిఎస్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో ఈ బీమా కంపెనీ మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నానని అదార్‌ పూనవల్లా పేర్కొన్నారు. తమ సంస్థలో 18,000 మంది ఏజెంట్లు, 2,000 కార్పొరేట్లు, ఫైనాన్సీయల్‌ రంగంలో 80 సంస్థలతో కార్యకలాపాలను కలిగి ఉందన్నారు. గడిచిన ఐదేళ్లలో సగటున 26 శాతం వృద్ధిని సాధించామన్నారు.

➡️