బ్యాంకింగ్‌ షేర్లకు లాభాలు

Apr 16,2025 20:53 #Banking, #Business, #sensex, #shares gain

ముంబయి : దలాల్‌ స్ట్రీట్‌ వరుసగా మూడో రోజూ లాభాల్లో సాగింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో బుధవారం ఉదయం స్తబ్దుగా ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లోకి వెళ్లాయి. ఈ ఏడాది మార్చిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం సూచీ ఆరేళ్ల కనిష్టానికి చేరడం, ఆర్‌బిఐ మరోమారు వడ్డీ రేట్లను తగ్గించనుందనే అంచనాలు దలాల్‌ స్ట్రీట్‌కు మద్దతును అందించాయి. ఈ నేపథ్యంలోనే తుదకు బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 309.40 పాయింట్లు లేదా 0.40 శాతం పెరిగి 77,044కు చేరింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 109 పాయింట్ల లాభంతో 23,437 వద్ద ముగిసింది. బిఎస్‌ఇలో లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ కాపిటలైజేషన్‌ రూ.2.13 లక్షల కోట్లు పెరిగి రూ.415 లక్షల కోట్లకు చేరింది. బ్యాంకింగ్‌ స్టాక్స్‌ 1.5 శాతం పెరిగాయి. ఇండుస్‌ఇండ్‌ బ్యాంక్‌ 7 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 4.3 శాతం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ 0.6 శాతం, ఐసిఐసిఐ బ్యాంక్‌ 0.6 శాతం చొప్పున లాభపడ్డాయి.

సెన్సెక్స్‌-30 సూచీలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు అధికంగా లాభపడిన వాటిలో టాప్‌లో ఉన్నాయి. మరోవైపు మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, ఎల్‌అండ్‌టి, ఎన్‌టిపిసి షేర్లు అధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. అమెరికా మరోమారు చైనాపై టారిఫ్‌లు పెంచిందన్న వార్తలు ఇతర ఆసియన్‌ మార్కెట్లను ఒత్తిడికి గురి చేశాయి.

➡️