రెపోరేటును తగ్గించిన ఆర్‌బిఐ
ఐదేళ్లలో తొలిసారి
ముగిసిన ఎంపిసి భేటీ
6.4 శాతం వృద్ధి అంచనా
నూతన గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడి
ముంబయి : అధిక వడ్డీ రేట్లతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న రుణగ్రహీతలకు ఆర్‌బిఐ స్వల్ప ఊరట కల్పించింది. ఐదేళ్లలో తొలిసారి కీలక వడ్డీ రేటును పావు శాతం తగ్గించింది. మూడు రోజుల పాటు సాగిన ఆర్‌బిఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) శుక్రవారం ముగిసింది. గతేడాది డిసెంబర్‌లో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నూతన గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన సంజరు మల్హోత్రా ఆధ్వర్యంలో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25 శాతంగా ప్రకటించారు. చివరి సారిగా 2020 మేలో ఆర్‌బిఐ వడ్డీ రేట్లను తగ్గించింది. ఆ తర్వాత క్రమంగా 2.50 శాతం మేర పెంచి 6.5 శాతానికి చేర్చింది. గడిచిన రెండేళ్ల నుంచి లేదా వరుసగా 11 ఎంపిసి భేటీల్లోనూ యథాతథంగా ప్రకటించింది. పెరిగిన వడ్డీ రేట్లతో రుణ గ్రహీతలపై తీవ్ర భారం పడుతోంది. అధిక వడ్డీ రేట్లు, జిఎస్‌టి పన్నులు, ఆదాయపు పన్నులు, హెచ్చు ధరల భారాలతో ప్రజల కొనుగోళుశక్తి హరించుకుపోయింది. దీంతో మార్కెట్‌లో వినిమయం పడిపోవడంతో.. కార్పొరేట్ల ఆదాయాలపైనా తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలోనే పారిశ్రామిక వర్గాలు ప్రభుత్వంపై తెచ్చిన ఒత్తిడితోనే ఇటీవల ఆదాయపు పన్ను పరిమితిని రూ.12 లక్షలకు పెంచినట్లు రిపోర్టులు వచ్చాయి. తాజాగా వడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా మార్కెట్‌లో నగదు ప్రవాహం పెరిగి.. సరుకులకు, రుణాలకు డిమాండ్ పెరుగుతుందని ప్రభుత్వ వర్గాలు ఆశతో ఉన్నాయి.
ఆర్‌బిఐ తాజా ఎంపిసి భేటీలో రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించినట్లు మీడియాతో గవర్నర్ సంజరు మల్హోత్రా తెలిపారు. దీంతో రెపో రేటు 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గనుందన్నారు. చివరి సారిగా కరోనా పరిణామాలతో 2020 మే నెలలో రెపో రేటును 40 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఆ తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, దేశీయంగా ద్రవ్యోల్బణం ఎగిసిపడటంతో రెండేళ్ల పాటు వడ్డీ రేట్లను క్రమంగా పెంచింది. తాజా తగ్గింపుతో గృహ, వాహన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం 2024-25లో భారత జిడిపి 6.4 శాతంగా ఉండొచ్చని మల్హోత్రా అన్నారు. వచ్చే 2025-26లో 6.7 శాతంగా అంచనా వేశామన్నారు. 2024-25లో రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ 4.8 శాతంగా నమోదయ్యే అవకాశాలున్నాయన్నారు. 2025-26లో ద్రవ్యోల్బణం 4.2 శాతానికి తగ్గొచ్చన్నారు. వాణిజ్య బ్యాంకుల ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. బ్యాంక్‌ల వద్ద సరిపడా ద్రవ్య లభ్యత ఉందన్నారు. దేశంలో సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో వీటిని అరికట్టేందుకు ప్రత్యేకంగా బ్యాంక్.ఇన్ డొమైన్‌ను తీసుకురానున్నట్లు గవర్నర్ తెలిపారు.
