న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద టెక్నాలజీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) నికర లాభాల్లో తగ్గుదల చోటు చేసుకుంది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2024-25) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 2 శాతం తగ్గుదలతో రూ.12,224 కోట్ల లాభాలను ప్రకటించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రమైఆసికంలో రూ.12,434 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇదే సమయంలో రూ.61,237 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. గడిచిన క్యూ4లో రూ.64,479 కోట్లకు పెరగడం విశేషం. ఆర్థిక ఫలితాల సందర్బంగా రూ.1 ముఖ విలువ కలిగిన షేర్‌పె రూ.30 చొప్పున తుది డివిడెండ్‌ను చెల్లించేందుకు కంపెనీ బోర్డు నిర్ణయిచింది. వరుసగా రెండో త్రైమాసికంలోనూ మెరుగైన ఆర్డర్ బుక్ సాధించామని టిసిఎస్ సిఇఒ కృతివాసన్ తెలిపారు. వార్షిక ఆదాయం 30 బిలియన్ డాలర్లను దాటడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. గడిచిన క్యూ4లో కొత్తగా 625 మంది ఉద్యోగులను తీసుకున్నామని ఆ సంస్థ హెచ్‌ఆర్ చీఫ్ మిలింద్ లక్కడ్ పేర్కొన్నారు. మొత్తం ఉద్యోగుల సంఖ్య 6.07 లక్షలకు చేరిందన్నారు.
