- క్యూ3లో రూ.12,380 కోట్ల లాభాలు
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ఐటి సేవల కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్)లో భారీగా ఉద్యోగులు తగ్గారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2024-25) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 5,000 మంది ఉద్యోగులు తగ్గారు. ఇదే విషయాన్ని ఆ సంస్థ స్టాక్ ఎక్సేంజీ ఫైలింగ్‌లో తెలిపింది. దీంతో డిసెంబర్ ముగింపు నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,07,354గా నమోదయ్యింది. క్రితం క్యూ3లో కంపెనీ నికర లాభాలు 12 శాతం పెరిగి రూ.12,380 కోట్లుగా చోటు చేసుకున్నాయి. ఇంతక్రితం ఏడాది 2023-24 ఇదే త్రైమాసికంలో రూ.11.058 కోట్ల లాభాలు ప్రకటించింది. గడిచిన క్యూ3లో కంపెనీ మొత్తం ఆదాయం 5.6 శాతం పెరిగి రూ.63,973 కోట్లకు చేరింది. డిసెంబర్ త్రైమాసికం ఫలితాల సందర్బంగా ఒక్కో షేరుకు రూ.10 మధ్యంతర డివిడెండ్‌తో పాటు, రూ.66 చొప్పున స్పెషల్ డివిడెండ్ చెల్లించనున్నట్లు టిసిఎస్ తెలిపింది. దీనికి జనవరి 17న రికార్డు తేదీగా తీసుకోనున్నట్లు పేర్కొంది. ఫిబ్రవరి 3న చెల్లింపులు జరుగుతాయని పేర్కొంది.