ముంబయి : రోజుకో రికార్డ్ స్థాయిలో రూపాయి విలువ పతనం కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ మరింత క్షీణించి నూతన రికార్డ్ కనిష్టానికి పడిపోయింది. బుధవారం డాలర్‌తో రూపాయి విలువ 13 పైసలు పతనమై డాలర్‌తో 85.87 కనిష్ట స్థాయికి దిగజారింది. భారత కరెన్సీ చరిత్రలోనే ఇది మరో రికార్డ్ కనిష్ట స్థాయి కావడం ఆందోళనకర అంశం. రూపాయి విలువ పడిపోవడం ద్వారా అనేక దిగుమతి ఉత్పత్తులు భారం కానున్నాయి. విదేశీ చెల్లింపులు పెంచాల్సి వస్తుంది. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్‌లో 85.82 వద్ద తెరుచుకున్న రూపాయి విలువ.. ఇంట్రాడేలో ఏకంగా 85.89 కనిష్ట స్థాయిని తాకింది. ఇది భారత దేశ చరిత్రలోనే రూపాయి ఆల్‌టైం పతనం. స్టాక్ మార్కెట్లలో ఒత్తిడి, విదేశీ సంస్థాగత పెట్టుబడులు తరలిపోవడం, ఇతర దేశీయ బలహీన ఆర్ధికాంశాలు రూపాయి విలువను చతికిల పడేలా చేస్తున్నాయి. ఇంతక్రితం మంగళవారం సెషన్‌లోనూ 6 పైసలు కోల్పోయి 85.74 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్ ధర 0.90 శాతం పెరిగి 77.74 డాలర్ల వద్ద ట్రేడింగ్ అయ్యింది. ఎఫ్‌ఐఐలు వరుసగా తరలిపోవడానికి తోడు భారత విదేశీ మారకం నిల్వలు డిసెంబర్ 27తో ముగిసిన వారంలో 4.122 బిలియన్ డాలర్లు తరిగి 640.279 బిలియన్ డాలర్లకు పడిపోవడం భారత కరెన్సీపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. మరోవైపు భారత జిడిపి 2024-25లో 6.4 శాతానికి పరిమితం కానుందనే కేంద్ర గణంకాల అంచనాలు రూపాయిపైనా ఒత్తిడిని పెంచుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు.. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాలతో బుధవారం భారత మార్కెట్లు స్వల్ప నష్టాలను చవి చూశాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్ 50 పాయింట్ల నష్టంతో 78,148కు చేరగా.. నిఫ్టీ 18 పాయింట్ల నష్టంతో 23,688 వద్ద ముగిసింది. ఐటి, ఎఫ్‌ఎంసిజి, గ్యాస్ షేర్లకు కొనుగోళ్ల మధ్దతు లభించింది.