ఎల్‌ఐసిలో మళ్లీ వాటాల విక్రయం..!

Mar 12,2025 23:56 #Business, #Lic, #shares
  • 2-3 శాతం అమ్మాలని కేంద్రం యోచన

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని దిగ్గజ జీవిత బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి)లో 2-3 శాతం వాటాలను విక్రయించాలని మోడీ సర్కార్‌ యోచిస్తోంది. 2022లో ఐపిఒకు వచ్చిన సమయంలో 3.5 శాతం వాటాకు సమానమైన 22.13 కోట్ల షేర్లను విక్రయించింది. దీంతో రూ.21,000 కోట్ల నిధులను తమ ఖజానాలో వేసుకుంది. ప్రభుత్వానికి ప్రస్తుతం ఎల్‌ఐసిలో 96.5 శాతం వాటా ఉంది. కాగా.. 2027 నాటికి ఇందులో కనీసం 10 శాతం వాటాను ప్రయివేటు శక్తులకు కట్టబెట్టాలని బిజెపి ప్రభుత్వం ప్రణాళికలను సిద్దం చేస్తోంది. మార్కెట్‌ పరిస్థితులకు అనుకూలంగా క్రమంగా వాటాలను విక్రయించాలనేది ప్రభుత్వ వ్యూహమని మింట్‌ ఓ కథనంలో వెల్లడించింది.

వచ్చే ఆర్ధిక సంవత్సరం (2025-26)లో 2-3 శాతం వాటా విక్రయం ద్వారా రూ.9,500 కోట్ల నుంచి రూ.14,500 కోట్ల వరకు నిధుల్ని సమకూర్చుకొనే అవకాశం ఉంది. 2027 మే నాటికి ఎల్‌ఐసిలో కనీసం 10 శాతం వాటాలను విక్రయించాలని సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) ఆదేశించింది. ఈ వాటాలను చిన్న విడతలుగా ఉపసంహరించుకోవాలని కేంద్రం యోచన. ప్రపంచంలోనే బీమా రంగంలో ఎల్‌ఐసి మూడో అత్యంత బలమైన కంపెనీగా గుర్తింపును పొందింది. బ్రాండ్‌ స్ట్రెంత్‌ ఇండెక్స్‌ (బిఎస్‌ఐ)లో 100కు గాను 88 స్కోర్‌ పొందినట్లు బ్రాండ్‌ ఫైనాన్స్‌ ఇన్సూరెన్స్‌ 100 రిపోర్ట్‌-2025లో ఇటీవల వెల్లడించింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో ఎల్‌ఐసి నికర లాభాలు 17 శాతం పెరిగి రూ.11,056 కోట్లకు చేరాయి. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.9,444.42 కోట్ల లాభాలు నమోదు చేసింది. గడిచిన క్యూ3లో ముఖ్యంగా ఉద్యోగుల వ్యయాలు తగ్గడంతో ప్రధానంగా నిర్వహణ వ్యయాలు తగ్గి సంస్థ మెరుగైన లాభాలకు దోహదం చేశాయి.

➡️