- తెలుగు వ్యక్తికి దిగ్గజ బ్యాంక్ పగ్గాలు
న్యూఢిల్లీ : దిగ్గజ విత్త సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని ఆ బ్యాంక్ మంగళవారం రెగ్యూలేటరీ సంస్థలకు తెలిపింది. ఇప్పటి వరకు ఛైర్మన్‌గా ఉన్న దినేష్ ఖారా పదవీ విరమణ పొందారు. ఖరా 2020 అక్టోబర్‌లో నియమితులు కాగా.. ఆయన పదవీకాలం 2024 ఆగస్టు 28తో ముగిసింది. కాగా.. 59 ఏళ్ల శెట్టి ఇంతక్రితం అత్యంత సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన పలు కేంద్ర ప్రభుత్వ కమిటీల్లో పని చేశారు. ఇప్పటి వరకు బ్యాంక్ రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్ పోర్టుపోలియో బాధ్యతలను చూశారు.
దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థగా ఉన్న ఎస్‌బిఐ చీఫ్ బాధ్యతలు తొలిసారి ఓ తెలుగు వ్యక్తికి దక్కడం విశేషం. ప్రభుత్వ రంగ సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ల నియామాక సంస్థ అయినా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్‌ట్యూషన్ బ్యూరో (ఎఫ్‌ఎస్‌ఐబి) ఎస్‌బిఐ తదుపరి చైర్మన్‌గా శ్రీనివాసులు శెట్టిని ఎంపిక చేస్తూ ఇటీవల సిఫార్సు చేయగ.. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
శ్రీనివాసులు శెట్టి 1988లో ప్రొబిషనరీ ఆఫీసర్‌గా ఎస్‌బిఐలో తన కేరీర్‌ను ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ.. 2020లో ఎస్‌బిఐ బోర్డులో ఎండిగా చేరారు. ఛైర్మన్ హోదాకు ముందూ ఆయన ఎస్‌బిఐ అంతర్జాతీయ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జన్మించిన శ్రీనివాసులు శెట్టి అగ్రికల్చర్ సైన్స్‌లో డిగ్రీ పొందిన ఆయన 1988లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఎస్‌బిఐలో తన కేరీర్‌ను ప్రారంభించి.. అంచెలంచెలుగా ఎదిగారు. 36 ఏళ్లు పైగా సాగిన కెరీర్‌లో కార్పొరేట్ క్రెడిట్, రిటైల్, డిజిటల్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, అభివృద్థి చెందిన దేశాల మార్కెట్‌లలోని బ్యాంకింగ్‌లో విశేష అనుభవం కలిగి ఉన్నారు. న్యూయార్క్‌లోని విభాగానికి వైస్ ప్రెసిడెంట్ వంటి కీలక బాధ్యతలను నిర్వహించారు.