స్థిరంగా భారత బ్యాంకింగ్‌ వ్యవస్థ

Apr 1,2024 21:08 #Business, #PM Modi, #RBI
  • పిఎస్‌బిలకు రూ.3.5 లక్షల కోట్ల మూలధనం
  • ఆర్‌బిఐ వార్షికోత్సవంలో ప్రధాని మోడీ వెల్లడి

న్యూఢిల్లీ : గడిచిన పదేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు రూ.3.5 లక్షల కోట్ల మూలధనం సమకూర్చామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) 90వ ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ వార్షికోత్సవం సందర్బంగా సోమవారం ప్రధాని ప్రత్యేక నాణేన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014లో ఆర్‌బిఐ 80 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలోనూ తాను పాల్గొన్నాని తెలిపారు. అప్పుడు పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. ఇప్పుడు భారతదేశ బ్యాంకింగ్‌ వ్యవస్థ ప్రపంచంలో బలమైన, స్థిరమైన బ్యాంకింగ్‌ వ్యవస్థగా ఉందన్నారు. తమ ప్రభుత్వం గుర్తింపు, తీర్మానం, రీక్యాపిటలైజేషన్‌ వ్యూహంపై పని చేసిందన్నారు. పదేళ్లలో దాదాపు రూ.3.25 లక్షల కోట్ల విలువైన రుణాలు దివాలా కోడ్‌ ద్వారా పరిష్కరించామన్నారు. ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మాట్లాడుతూ.. బ్యాంకింగ్‌ వ్యవస్థ సవాళ్లను ఎదుర్కోవటానికి, ధరల స్థిరత్వాన్ని మరింత ప్రభావవంతంగా నిర్వహించడానికి ఇటీవలి సంవత్సరాలల్లో ఇన్‌సాల్వెన్సీ, దివాలా కోడ్‌ అమలు చేయడం, సంస్కరణలు తమకు సహాయపడ్డాయన్నారు. ప్రపంచంలో జరుగుతున్న వేగవంతమైన మార్పుల నేపథ్యంలో మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్‌బిఐ ఎప్పటికప్పుడు అవసరమైన విధాన చర్యలు తీసుకుంటోందన్నారు.

➡️