ముంబయి : నష్టాలకు బ్రేకిచ్చి దేశీయ మార్కెట్లు ఈ వారంలో లాభాలతో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ, కనిష్ఠాల వద్ద కొనుగోళ్లు సూచీలకు మద్దతుగా నిలుస్తుండటంతో సోమవారం ట్రేడింగ్‌లో మార్కెట్లు లాభాలను సూచించాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ 22,600 మార్క్‌ను దాటింది. ఈరోజు ఉదయం 9 గంటల 30 నిముషాల సమయంలో సెన్సెక్స్ 227 పాయింట్లు పెరిగి 74,560 వద్ద, నిఫ్టీ 72 పాయింట్ల లాభంతో 22,625 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 34 పైసలు క్షీణించి 87.29గా కొనసాగుతోంది. నిఫ్టీలో సన్‌ఫార్మా, భారత్ ఎలక్ట్రానిక్స్, బజాజ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు రాణిస్తుండగా, ఇండస్ ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, బజాజ్ ఆటో, ఐటీసీ షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి. ఆసియా పసిఫిక్ మార్కెట్లు సోమవారం మిశ్రమంగా కనబడుతున్నాయి. జపాన్ నిక్కీ 0.57 శాతం, దక్షిణ కొరియా కోస్పి 0.47 శాతం, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ సూచీ 0.2 శాతం మేర లాభాల్లో ఉండగా, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ సూచీ 1.69 శాతం నష్టాల్లో ట్రేడవుతోంది. చైనా మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. మరోవైపు, అమెరికా మార్కెట్లు గత శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఎస్‌అండ్‌పీ 500 0.55శాతం, నాస్‌డాక్ 0.7శాతం, డోజోన్స్ 0.52శాతం మేర పెరిగాయి.
