- సెన్సెక్స్ 319 పాయింట్ల పతనం
- విశ్వాసాన్ని నింపలేని బడ్జెట్
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లలో మోడీ సర్కార్ బడ్జెట్ విశ్వాసాన్ని నింపలేకపోయింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల పెంపు నిర్ణయం ప్రపంచ దేశాల మార్కెట్లను ఆందోళనకు గురి చేశాయి. ఎఫ్‌ఐఐలు తరలిపోవడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ రికార్డ్ పతనాన్ని చవి చూడటం, వాణిజ్య యుద్ధ భయాలు తదితర కారణాల నేపథ్యంలోనే సోమవారం బిఎస్‌ఇ సెన్సెక్స్ 319.22 పాయింట్లు లేదా 0.41 శాతం పతనమై 77,186.74కు దిగజారింది. ఇంట్రాడేలో 77,260-76,756 మధ్య కదలాడింది. ఇంట్రాడేలో దాదాపు 700 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ సైతం 121 పాయింట్ల నష్టంతో 23,361 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో ఎల్‌అండ్‌టి, టాటా మోటార్స్, హిందుస్థాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్స్, ఐటిసి షేర్లు అధికంగా నష్టపోయిన వాటిలో టాప్‌లో ఉన్నాయి. మరోవైపు బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్, భారతీ ఎయిర్‌టెల్, మారుతీ సుజుకీ షేర్లు అధిక లాభాలను నమోదు చేశాయి.