తమిళనాడులో టాటా మోటార్స్‌ భారీ ప్లాంట్‌

  • శంకుస్థాపన చేసిన సిఎం స్టాలిన్‌
  • రూ.9,000 కోట్ల పెట్టుబడులు

చెన్నయ్ : దిగ్గజ ఆటోమొబైల్‌ కంపెనీ టాటా మోటార్స్‌ తమిళనాడులో అతిపెద్ద తయారీ ప్లాంట్‌ నెలకొల్పడానికి ముందుకు వచ్చింది. చెన్నయ్ కి 115 కిలోమీటర్ల దూరంలోని రాణిపేటలో రూ.9000 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేస్తోన్న తయారీ కేంద్రానికి శనివారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌, టాటా సన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంట్‌లో టాటా మోటార్స్‌, జాగ్వర్‌ లాండ్‌ రోహర్‌ (జెఎల్‌ఆర్‌) వాహనాలను తయారు చేయనుంది. ఇక్కడ తయారయ్యే వాహనాలను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించనుంది. తమిళనాడు ప్రభుత్వంతో టాటా మోటార్స్‌ చేసుకున్న ఒప్పందం ప్రకారం.. వచ్చే ఐదేళ్లలో రూ.9,000 కోట్లను పెట్టుబడి పెట్టనుంది. సుమారు 5000 ఉద్యోగాలను కల్పించనుంది. ”ఎలక్ట్రిక్‌, లగ్జరీ వాహనాలతో సహా తర్వాతి తరం కార్లు, ఎస్‌యువిలను ఇక్కడ తయారు చేయనున్నాం. తమిళనాడు ప్రగతిశీల విధానాలతో ప్రముఖ పారిశ్రామిక రాష్ట్రంగా ఉంది. అనేక టాటా గ్రూప్‌ కంపెనీలు ఇక్కడ నుండి విజయవంతంగా పని చేస్తున్నాయి. మహిళా సాధికారతయ కల్పించే దిశగా చర్యలు తీసుకుంటాము. దశలవారీగా ఈ తయారీ కేంద్రం అందుబాటులోకి రానుంది. ఏడాదికి 2.50 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యంలతో దీన్ని ఏర్పాటు చేస్తున్నాము.” అని చంద్ర శేఖరన్‌ తెలిపారు.

➡️