- మాధబిపై ఆరోపణలను చర్చించని సభ్యులు
ముంబయి : సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజీ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) బోర్డు మీటింగ్‌ను మమా అనిపించారని తెలుస్తోంది. ఆ రెగ్యూలేటరీ ఛైర్పర్సన్ మాధబి పూరీ బుచ్‌పై వచ్చిన తీవ్ర ఆరోపణలపై సెబీ బోర్డు సభ్యులు కనీసం చర్చించకుండా.. విషయాన్ని పక్కదారి పట్టించారని స్పష్టమవుతోంది. అదానీ విదేశీ సంస్థలతో మాధబి అంటకాగారని.. పలు సంస్థల నుంచి ఇప్పటికీ ఆదాయాలను పొందుతున్నారని అమెరికన్ రీసెర్చ్ సంస్థ హిండెన్‌బర్గ్, ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపించాయి. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ తర్వాత తొలిసారి సోమవారం జరిగిన సెబీ బోర్డు భేటీలో మాధబిపై వచ్చిన ఆరోపణలపై తీవ్రంగా చర్చించే అవకాశం ఉందని భావించగా.. అలాంటిదేమీ చర్చకే రాకపోవడం గమనార్హం.
సెబీ నిబంధనలను ఉల్లంఘించి మాధబి ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి ఆదాయాలను పొందుతున్నారని కాంగ్రెస్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అదే విధంగా సెబీ విచారణను ఎదుర్కొంటున్న ఓ కంపెనీకి చెందిన అనుబంధ సంస్థకు మాధబి దంపతులు తమ ముంబయిలోని ఆస్తిని అద్దెకు ఇచ్చారని.. దీని వల్ల పరస్పర ఆదాయాలను పొందారని ఆరోపించింది. ఆమె భర్త ధవల్ బుచ్, వారి కన్సల్టెన్సీ సంస్థ అగోరా అడ్వైజరీకి కార్పొరేట్లు పలు చెల్లింపులు చేశారని విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
మాధబిపై వచ్చిన పరస్పర ప్రయోజనాల ఆరోపణలపై ఎలాంటి చర్చ జరగలేదని ఇద్దరు బోర్డు సభ్యులు పేర్కొన్నారు. ఇది తమలో కొంత మందిని నిరాశకు గురి చేసిందన్నారు. మాధబిపై కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఆరోపణలు చేస్తున్నప్పటికీ.. దీనిపై బోర్డు చర్య తీసుకోవడానికి పరిమిత పరిధి ఉంటుందన్నారు. ఛైర్పర్సన్, పూర్తికాల సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమించడమే ఇందుకు కారణమన్నారు.
”ఛైర్పర్సన్, బోర్డు సభ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. ఒక సాధారణ కంపెనీ బోర్డు తరహాలో సెబీ ఉండదు. బోర్డు సభ్యులను తొలగించడం లేదా జరిమానా విధించడం సాధ్యం కాదు. మాధబి పరస్పర విరుద్ధ ప్రయోజనాల విషయంలో కూడా చర్యలు తీసుకోవడానిక సెబీ బోర్డుకు అధికారం ఉండదు. ” అని సెబీ మాజీ ఛైర్పర్సన్ ఒక్కరు తెలిపారు.
ప్రస్తుతం సెబీకి ఛైర్‌పర్సన్‌తో కలిపి ఎనిమిది మంది బోర్డు సభ్యులు ఉన్నారు. ఇందులో ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజరు సేథ్, ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్ రాజేశ్వర్ రావు, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెక్రటరీ దీప్తి గౌర్ ముఖర్జీ సభ్యులుగా ఉన్నారు. ”సెబీ ఛైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే అధికారం సెబీ బోర్డుకు లేకపోయినప్పటికీ.. వారు కనీసం ఈ అంశంపై చురుకుగా చర్చించాల్సింది. రెగ్యులేటర్ సమస్యను తప్పించుకుంటోందన్న అభిప్రాయాన్ని అధిగమించడానికి ఇది సహాయపడేది. మాధబి అన్ని ఆరోపణలను ఖండించినప్పటికీ, సెబీ బోర్డు ఒక సంస్థగా కూడా ఈ సమస్యను చర్చించి ఉండాల్సింది.” అని ఇన్‌గవర్న్ రీసెర్చ్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు, ఎండి శ్రీరామ్ సుబ్రమణియన్ పేర్కొన్నారు.