ముంబయి : బంగారం ధర భగభగమంటోంది. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ భారీగా పతనం కావడం, అభరణాల వర్తకులు, రిటైలర్ల నుంచి డిమాండ్ పెరగడంతో బంగారం, వెండి ధరలు మరింత పెరిగాయి. గురువారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 99.9శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.500 పెరిగి రూ.81,300లకు చేరింది. ఆభరణాలను తయారు చేసేందుకు వినియోగించే 99.5శాతం స్వచ్ఛత గల బంగారంపై కూడా రూ.500 పెరిగి రూ.80,900 వద్ద నమోదయ్యింది. కిలో వెండి ధర రూ.2,300 పెరిగి రూ.94వేలకు చేరింది. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం కావడంతో ఎంసిఎక్స్‌లో బంగారం ధర రూ.79వేల ఎగువన ట్రేడ్ అవుతున్నదని ఎల్‌కెపి సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ అనలిస్ట్ వైస్ ప్రెసిడెంట్ జతీన్ త్రివేది తెలిపారు. ముడి చమురు ధరలు పెరిగిపోవడంతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు ఉపసంహరించడంతో రూపాయి విలువ పతనమైంది.
