- మార్కెట్ శక్తుల చేతుల్లోనే విలువ
- ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా
న్యూఢిల్లీ : రూపాయి విలువ రోజువారి మార్పులపై రిజర్వ్ బ్యాంక్ పెద్దగా ఆందోళన చెందదని ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. శనివారం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అనంతరం మల్హోత్రా మీడియాతో మాట్లాడారు. డాలరుతో రూపాయి విలువను మార్కెట్ శక్తులు నిర్ణయిస్తాయన్నారు. దీర్ఘకాల, మధ్యస్థ కాలంలో రూపాయి విలువ మార్పుపైనే రిజర్వు బ్యాంక్ దృష్టి కేంద్రీకరిస్తుందన్నారు. రూపాయి విలువ స్థాయిని గానీ, ఒక బ్యాండ్‌ను గానీ ఆర్‌బిఐ చూడబోదన్నారు. ఎప్పుడైన భారీ స్థాయిలో ఒడుదొడుకులు ఎదుర్కొంటే మాత్రమే సెంట్రల్ బ్యాంక్ జోక్యం చేసుకుంటామన్నారు. రోజువారీ విలువ తగ్గడం, పెరగడం గురించి పట్టించుకోబోమని స్పష్టం చేశారు. రూపాయి విలువ 5 శాతం పతనమైతే దేశీయంగా ద్రవ్యోల్బణం 30-35 బేసిస్ పాయింట్ల మేర పెరుగుతుందని గవర్నర్ తెలిపారు. అంతర్జాతీయ పరిణామాల వల్లే రూపాయి విలువ తగ్గుతోందన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలపై చేస్తున్న ప్రకటనలు రూపాయిని ఒత్తిడికి గురి చేస్తోన్నాయన్నారు. దీనికి త్వరలోనే పరిష్కారం లభించొచ్చన్నారు.