- నాలుగేళ్ల కనిష్టానికి పతనం..!
- 2024-25లో 6.4 శాతమే
- ఎన్‌ఎస్‌ఒ అంచనాల వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలోని అధిక ధరల పోటు ఆర్ధిక వ్యవస్థను మందగించేలా చేస్తున్నాయి. హెచ్చు ద్రవ్యోల్బణంతో ప్రజల కొనుగోలు శక్తి హరించుకుపోవడంతో ఆ ప్రభావం వృద్ధి రేటుపై స్పష్టంగా కనబడుతోంది. దీనికి నేషనల్ గణంకాల శాఖ (ఎన్‌ఎస్‌ఒ) తాజా అంచనాలు మరింత బలాన్ని చేకూర్చాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2024-25)లో భారత జిడిపి 6.4 శాతానికి పరిమితం కావొచ్చని మంగళవారం ఓ రిపోర్ట్‌లో అంచనా వేసింది. ఇది నాలుగేళ్లలోనే అత్యంత కనిష్ట స్థాయి కావడం ఆందోళనకరం. ఇంతక్రితం 2023-24లో జిడిపి 8.2 శాతం పెరిగింది. 2024-25 6.6 శాతం వృద్ధి ఉండొచ్చని ఆర్‌బిఐ ఇటీవల అంచనా వేసింది. దీంతో పోల్చినా జిడిపి మరింత తగ్గే అవకాశం ఉంది. మొదటి ముందస్తు అంచనాల మందగమనం ఆర్థిక కార్యకలాపాల మరింత పతనాన్ని స్పష్టం చేస్తోంది. వాస్తవిక జిడిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.184.88 లక్షల కోట్లకు చేరొచ్చని అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.173.82 లక్షల కోట్లుగా చోటు చేసుకుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2)లో వృద్థి ఏకంగా 5.4 శాతానికి పడిపోయి.. దాదాపు రెండేళ్ల కనిష్టానికి క్షీణించింది. ఆర్‌బిఐ, రేటింగ్ ఎజెన్సీల అంచనాల కంటే ఘోరంగా క్షీణించడం గమనార్హం. కేంద్ర గణంకాల శాఖ (ఎన్‌ఎస్‌ఒ) రిపోర్ట్ ప్రకారం.. క్యూ2లో మైనింగ్, గనుల రంగాలు అత్యంత పేలవ ప్రదర్శన కనబర్చాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో జిడిపి ఏకంగా 8.1 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. గడిచిన ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 6.7 శాతానికి పరిమితమయ్యింది. ఈ రెండింటితోనూ పోల్చినా జిడిపిలో భారీ తగ్గుదల నమోదుకావడం ఆందోళనకరం. మరోవైపు రేటింగ్ ఎజెన్సీలు కూడా 6 శాతం ఎగువన వృద్థి ఉండొచ్చని చేసిన అంచనాల కంటే మరింతగా పడిపోవడం విశేషం. జిడిపి 7 శాతం పెరగనుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అంచనా వేశారు. ఆర్‌బిఐ అంచనాలు మించి జిడిపి పతనం కావడం ఆర్థిక వ్యవస్థ పట్ల తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వీటిన్నిటీ పరిశీలనలోకి తీసుకుంటే భారత ఆర్థిక వ్యవస్థ బయటికి కనబడుతున్నంత బలంగా ఏమీ లేదని.. మందగమనం చాయలు స్పష్టం చేస్తోన్నాయి.