- సెన్సెక్స్ 1235 పాయింట్ల పతనం
- రూ.7.1 లక్షల కోట్లు ఆవిరి
- డాలర్‌తో రూపాయి భారీగా క్షీణత
ముంబయి : దలాల్ స్ట్రీట్‌ను ట్రంప్ టారీఫ్ భయాలు గడగడలాడించాయి. మంగళవారం కుప్పకూలిన మార్కెట్ల వల్ల ఒక్క పూటలోనే రూ.లక్షల కోట్ల సొమ్ము హరించుకుపోయింది. అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టడంతో త్వరలోనే టారీఫ్‌లు పెంచొచ్చనే అంచనాలతో అమ్మకాల ఒత్తిడి చోటు చేసుకుంది. దీంతో బిఎస్‌ఇ సెన్సెక్స్ 1,235 పాయింట్లు లేదా 1.60 శాతం పతనమై 75,838కు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 50 సూచీ 320 పాయింట్లు లేదా 1.37 శాతం కోల్పోయి 23,024 వద్ద ముగిసింది. బిఎస్‌ఇలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ ఒక్క సెషన్లోనే రూ.7.1 లక్షల కోట్లు ఆవిరై.. రూ.424.11 లక్షల కోట్లకు పరిమితమైంది. సోమవారం ట్రంప్ ప్రమాణస్వీకారం అనంతరం పలు కీలకనిర్ణయాలు తీసుకున్నారు. పొరుగు దేశాలైన కెనడా, మెక్సికోపై 25 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించారు. భారత్ సహా ఇతర దేశాలపైనా సుంకాలు విధిస్తామని గతంలో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారోనన్న ఆందోళనలు భారత మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దేశీయంగా భారత ఆర్థిక వ్యవస్థలో మందగమనం చోటు చేసుకుంటుంది. అనేక అంతర్జాతీయ, జాతీయ ఏజన్సీలు దేశ జిడిపి అంచనాలకు వరుసగా కోత పెట్టడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే 2024 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జిడిపి 5.4 శాతానికి పరిమితమై.. దాదాపు రెండేళ్ల కనిష్టానికి పడిపోయిన విషయం తెలిసిందే. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల వేళ వచ్చేనెల ఒకటో తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. వినియోగం, జిడిపి పడిపోతున్న వేళ కేంద్రం ఎలాంటి ప్రకటనలు చేస్తుందనే విషయంపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు విదేశీ ఇన్వెస్టర్లు అమెరికా మార్కెట్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాదిలో జనవరి 20 నాటికి రూ.58వేల కోట్ల ఈక్విటీలను విదేశీ సంస్థాగత మదుపర్లు వెనక్కి తీసుకున్నారు. ఇది భారత మార్కెట్లపై ఒత్తిడిని పెంచుతోంది. 2024-25 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీల ఫలితాలు ఆశించినవిధంగా లేవని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత పతనం కావడం ఆందోళనకరం. అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 14 దిగజారి 86.59కు పడిపోయింది. ట్రంప్ టారీఫ్‌ల భయాలు రూపాయిని ఒత్తిడికి గురిచేశాయి.
మూడు సూచీలు తప్పా..
సెన్సెక్స్ 30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, ఐటిసి, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు మినహా అన్ని షేర్లూ నష్టాల్లో ముగిశాయి. జొమాటో, ఎన్‌టిపిసి, అదాని పోర్ట్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్‌బిఐ షేర్లు అధికంగా నష్టపోయిన వాటిలో టాప్‌లో ఉన్నాయి. డిసెంబర్‌లో జొమాటో నికర లాభాలు 57 శాతం పతనం కావడంతో.. ఆ కంపెనీ సూచీ 11 శాతం పతనమైంది. బిఎస్‌ఇలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 2 శాతం చొప్పున పతనమయ్యాయి. అన్ని రంగాలూ నష్టాలను చవిచూశాయి. నిఫ్టీలో రియల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు అత్యధికంగా 4 శాతం క్షీణించాయి. బ్యాంక్, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు 2 శాతం మేర కోల్పోయాయి.