బెంగళూరు : దేశంలోనే రెండో అతిపెద్ద ఐటి కంపెనీ ఇన్ఫోసిస్ వందలాది ట్రైనీ ఉద్యోగులపై వేటు వేసిందని సమాచారం. మైసూరు క్యాంపస్‌లో శిక్షణ పొందుతున్న దాదాపు 400 మందిని ఇంటికి పంపిస్తోందని తెలుస్తోంది. వరుసగా మూడు సార్లు అంచనా పరీక్షల్లో విఫలమైన కారణంగా వారిని తొలగిస్తున్నట్లు ఆ సంస్థ వర్గాలు పేర్కొనట్లు మీడియాలో రిపోర్టులు వస్తోన్నాయి. ఉన్నఫలంగా సాయంత్రం ఆరు గంటల్లోపే ట్రైనీలంతా క్యాంపస్‌ను వదిలి వెళ్లాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. కాగా.. ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన తమను ఇన్ఫోసిస్ అత్యంత బాధాకరంగా తొలగిస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. తాము కావాలనే ఫెయిల్ అయ్యేలా పరీక్షలను చాలా కఠినంగా పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
